Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ‘మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేయకపోతే నెగెటివ్‌లోకి వెళ్తారు. మీకు రావాల్సిన లాభాలకు గండి పడుతుంది’ అంటూ కొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్నేరాలలో పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు రెండు కోట్ల వరకు బాధితులు నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాలలో సైబర్ నేరాలను అడ్డుకోవడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే సైబర్‌నేరగాళ్లు ఎవరికి అందని ఎత్తులతో ముందుకెళ్తున్నారు. బాధితులు ట్రేడింగ్‌లో భారీ లాభాలు సంపాదించవచ్చనే ఆలోచనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే ప్రకటనలు, లింక్‌లను చూసి ట్రాప్‌లో పడుతున్నారు. ట్రాప్‌లో పడ్డవారు కొన్నాళ్లపాటు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు.
ఇందులో భాగంగానే సైబర్‌నేరగాళ్లు సూచించే లింక్‌లను క్లిక్ చేసి ట్రేడింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లలో బ్యాకెండ్‌లో సైబర్‌నేరగాళ్లు స్క్రీన్‌పై బాధితుల లాభాలు భారీగా చూపిస్తుంటారు. అయితే అవి డ్రా చేసుకోవడానికి వెళ్లే సరికి డ్రా కాకుండా బ్యాకెండ్ నుంచి నిలుపుదల చేస్తుంటారు. ఇదంతా గత కొన్నేళ్లుగా జరుగుతున్న తంతూ. ఇప్పుడు బాధితులు మొదట కొంత పెట్టుబడి పెట్టడంతో నమ్మకం కోసం తక్కువ మొత్తంలో కొన్ని లాభాలు చూపిస్తుంటారు. నమ్మకం కుదిరిన తరువాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసిన సైబర్‌చీటర్స్ నెగెటివ్ బ్యాలెన్స్ పేరుతో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో, వేగంగా ట్రేడింగ్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని, అలా కాకుండా నెమ్మదిగా ట్రేడింగ్ చేస్తే అకౌంట్లలోని డబ్బంతా నెగెటివ్‌లోకి వెళ్తుందని బాధితులను నిండా ముంచేస్తున్నారు.
నెగెటివ్‌లోకి వెళ్తారని..
చైతన్యపురికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగిని గ్యాలక్సీ ఎర్నింగ్ 8218 డిస్కషన్ గ్రూప్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో శ్రేయ అనే మహిళ యాడ్ చేసింది. ఆ గ్రూప్‌లో ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయంటూ తమ కంపెనీ వెబ్సైట్ యాప్ప్లైయర్.కామ్‌లో రిజిస్టేష్రన్ చేసుకోవాలని సూచించారు. రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేయడంతో 5 శాతం నుంచి 10 శాతం వరకు లాభాలు వచ్చాయి. దీంతో ఆమెను సైబర్‌మోసగాళ్లు మరింతగా పెట్టుబడి పెట్టాలంటూ ప్రోత్సహించారు. యాప్ ప్లేయర్ యాప్‌లో ట్రేడింగ్ చేస్తూ నేరగాళ్లు చెప్పినట్లు వివిధ బ్యాంకు ఖాతాలలో డబ్బు డిపాజిట్ చేస్తూ ఆ స్క్రీన్ షాట్‌ను నేరగాళ్లు సూచించిన వాట్సాప్ నంబర్‌కు పంపిస్తూ వచ్చింది. అందులో ప్లాటినం, గోల్డ్, డైమాండ్ అంటూ స్కీమ్‌లు ఉండటంతో ఆయా స్కీమ్‌లను సెలక్ట్ చేసుకొని డబ్బు డిపాజిట్ చేస్తూ వెళ్లడంతో ఆటోమెటిక్‌గా స్క్రీన్‌పై తాను డిపాజిట్ చేసిన డబ్బు వివరాలు కన్పిస్తూ వచ్చాయి.
దానికి 10 శాతం లాభాలు రోజు కన్పిస్తుండటంతో బాధితురాలు నిజమని నమ్ముతూ రూ. 21 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. డబ్బు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఒకేసారి రూ. 10 లక్షలు మాత్రమే ఉన్నాయంటూ కన్పించింది. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి అడగడంతో ‘మీ అకౌంట్ నెగెటివ్‌లోకి వెళ్లింది. ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడితే ఈజీగా పాజిటివ్‌లోకి వచ్చి మరిన్ని లాభాలు వస్తాయి’ అంటూ మరో రూ.21 లక్షలు డిపాజిట్ చేయండంటూ కోటి రూపాయల వరకు లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ఇక్కడ మీరు వేగంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేయాలని, లేదంటే మార్కెట్ ఒడుదుడుకులతో మీ అకౌంట్ నెగెటివ్‌లోకి వెళ్తుందని నమ్మించారు. మీరు పెట్టిన డబ్బంతా డ్రా చేసుకోవాలంటే రూ. 21 లక్షలు డిపాజిట్ చేసి మీ పాత డబ్బును డ్రా చేసుకోండి, మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటూ ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. బాధితురాలు ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.