సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు జనరల్ కన్సల్టెంట్‌గా 5 సంస్థలు అర్హత సాధించాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వీ.ఎస్.రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు కోసం జనరల్ కన్సల్టెంట్ నియామకానికి బిడ్లలో పాల్గొనడానికి ఫ్రీ క్వాలిఫికేషన్ కోసం 5 కన్సార్టియంలు సమర్పించిన పత్రాలు, ఇతర డేటాను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్)కు చెందిన సాంకేతిక బృందం పరిశీలించింది. ఆయా కన్సార్టియంల సాంకేతిక సామర్థ్యాలు, ఆర్థిక ప్రొఫైల్స్‌ను అంచనా వేశారు.
హెచ్ఏఎంఎల్ సూచించిన అర్హత ప్రమాణాలకు కన్సార్టియంల ప్రతి స్పందనపై ఆధారపడి ఉంటుంది. వారు నిర్వహించే ప్రాజెక్టుల సంఖ్య, పరిమాణం, టెండర్ డాక్యుమెంట్ తయారీలో వారి అనుభవం, డీపీఆర్ సమీక్ష, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ రికార్డ్, ప్రాజెక్టు మానిటరింగ్ కన్సల్టెన్సీ, వివరణాత్మక ఇంజినీరింగ్ డిజైన్ల ఫ్రూఫ్ చెకింగ్ వంటి అంశాలపై అంచనా వేసి ఎంపిక చేశారు. చివరకు 5 కన్సార్టియంలు చివరి రౌండ్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తరువాత దశలో ఉన్న ప్రతిపాదన కోసం అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్-ఆర్ఎఫ్పీ) పత్రాలను ఎంపిక చేసిన కన్సార్టియంలకు జారీ చేస్తామని, ఆయా సంస్థలు తమ బిడ్లను వచ్చే ఏడాది జనవరి 20లోపు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
1. ఏఈకామ్ ఇండియా, ఈజీస్ రైల్ (ఫ్రాన్స్), ఈజీస్ ఇండియా
2. ఆయేసా ఇన్జెనెరియా వై ఆర్కిటెక్చురా(స్పెయిన్), ఆర్వీ అసోసియేట్స్, నిప్పన్ కోయ్(జపాన్)
3. కన్సల్టింగ్ ఇంజినీర్స్ గ్రూప్, కొరియా నేషనల్ రైల్వే (సౌత్ కొరియా)
4. సిస్ట్రా (ఫ్రాన్స్), ఆర్ఐటీఈఎస్, డీబీ ఇంజినీరింగ్ అండ్ కన్సల్టింగ్ (జర్మనీ)
5. టెక్నికా వై ప్రొయెక్టాస్(స్పెయిన్), పీఐఎన్ఐ గ్రూపు (స్విట్జర్లాండ్)