సిటీబ్యూరో, జులై 18 (నమస్తే తెలంగాణ): ఒక ఇన్స్పెక్టర్ సీట్ ఖాళీ అవుతుందనే సమాచారం రావడంతోనే ఆ స్థానంలో ఖర్చీఫ్ వేసి పెట్టాలని మరో ఇన్స్పెక్టర్ పైరవీలు ప్రారంభించి ఉన్నతాధికారుల ఆగ్రహనికి గురయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాచకొండ సైబర్‌క్రైమ్ సీఐగా పనిచేస్తున్న ఆయనను
వెంటనే మల్టీజోన్-2కు బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు విశ్వసనీయ సమాచారం మేరకు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు సంబంధించి సీఐడీ కేసు నమోదు చేసింది. ఆరు మంది నిందితులను ఒకేసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ విషయం కేసులో ఏ2 నిందితుడికి లీక్ కావడంతో అతడు పరారయ్యాడు.
ఇది ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి చేశారని సీఐడీ అధికారులు ప్రాథమికంగా అంతర్గత విచారణ చేసి, రాచకొండ సీపీ దృష్టికి తీసికెళ్లడం, ఆయన ఎలక్షన్‌రెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఉప్పల్ సీఐని అటాచ్ చేస్తున్న విషయం అధికారికంగా బయటకు రాకముందే సైబర్‌క్రైమ్ ఠాణాలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ ఆ పోస్టు కోసం పైరవీ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాచకొండ సీపీ వెంటనే పైరవీ చేస్తున్న ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే పైరవీలు చేసిన ఆ ఇన్స్పెక్టర్పై సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే మల్టీజోన్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇన్స్పెక్టర్ గతంలో వివిధ పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించారు. కొన్నాళ్ల కిందటే సైబర్‌క్రైమ్ ఠాణాకు వచ్చారు. అయితే లా అండ్ ఆర్డర్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆయన సైబర్‌క్రైమ్ ఠాణాలో ఎక్కువ రోజులు పనిచేయాలంటే మ నస్సు ఒప్పుకోలేదో? ప్రస్తుతం ఈఓడబ్ల్యూ, సైబర్‌క్రైమ్ ఠాణాలో పనిచేస్తు న్న సదరు సీఐని మల్టీజోన్-2కు సరెండర్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.