Hyderabad | సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్ర భుత్వం రూ.5,937కోట్ల అంచనా వ్య యం తో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ శాఖ ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు చేపట్టింది.
ట్రాఫిక్, వాహన రద్దీ ఉపశమనానికి ఎస్ఆర్డీపీ దోహదపడుతుంది. ప్రయాణ వేగాన్ని పెంచడం, సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, అంతేకాకుండా కనిష్ఠ భూసేకరణ నిధుల ఆధారంగా ఎస్ఆర్డీపీకి ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు రూ.178 కోట్ల వ్యయంతో చేపట్టిన గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లైఓవర్ వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వం ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ ఫె్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది, ప్రయాణ సమ యం కూడా ఆదా అవుతుంది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో 23 వ ఫ్లై ఓవర్ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఫలక్‌నుమా ఆర్వోబీ, శాస్త్రీపురం ఆర్వోబీ రైల్వే ఫోర్షన్ రెండు, మూడు నెలలో పూర్తి చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ రైల్వే అధికారులను కోరారు. వచ్చే జూలై నెల చివరి నాటి వరకు ఫలక్‌నుమా ఆర్వోబీ, ఆగస్టు నెల చివరి వరకు శాస్త్రీపురం ఆర్వోబీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రాజెక్టు వివరాలు..
గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫేజ్-2 ఫె్లైఓవర్ ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తున్నది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫె్లైఓవర్లపై నిర్మించిన మూడవ స్థాయి నిర్మాణం. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫె్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2 ఫె్లైఓవర్ నిర్మించారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్..
గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఈ ఫ్లైఓవర్ చాలా వరకు తగ్గిస్తుంది. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్ పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చికుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అకడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఉంటుంది.