సిటీబ్యూరో: ఆదిలోనే హంసపాదు అన్నట్లు.. ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మరో చిక్కు ముడి పడింది. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టక ముందే సికింద్రాబాద్ క్లబ్ కోర్టు మెట్లను ఎక్కింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కారణంగా తమ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ రక్షణ శాఖ జాప్యం చేసి.. ఎట్టకేలకు భూములను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రైవేటు ఆస్తులతో ఇప్పుడు మళ్లీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని హెచ్ఎండీఏ వర్గాలు భావిస్తున్నాయి. అదే కనుక జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చామని చెప్పుకునే ప్రాజెక్టు కూడా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
ప్రాజెక్టు నిర్మాణం వల్ల..
ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ఇన్నాళ్లు రక్షణ శాఖ భూములతో వివాదం వేధించింది. సుదీర్ఘ మంతనాల తర్వాత బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదనలతో రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తాజాగా జేబీఎస్ బస్టాండ్ సమీపంలో ఉండే సికింద్రాబాద్ క్లబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల క్లబ్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, విధివిధానాలను పాటిస్తూ నిర్మాణ పనులు చేపట్టేలా హెచ్ఎండీఏను ఆదేశించాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ఉన్నత న్యాయస్థానం… ఇష్టానుసారంగా ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లేలా నిర్మాణ పనులు చేపట్టకూడదని హెచ్ఎండీఏ, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
18 కిలోమీటర్ల మేర..
సీఎం రేవంత్ రెడ్డి 18 కిలోమీటర్ల ప్యాట్నీ-శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన భూముల బదలాయింపు ప్రతిపాదనలకు ఇటీవల రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో… ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్ నుంచి మొదలై తూంకుంట మీదుగా శామీర్‌పేట సమీపంలోని ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఈ కారిడార్ ముగియనుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కిలోమీటర్లు. మొత్తం 287 పిల్లర్లతో, ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. దీనిపై రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ వద్ద నుంచి అల్వాల్ వరకు మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులను నిర్మించనున్నారు.