సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం మరింత నిఘా నీడలోకి చేరనుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు నగరం విస్తరిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా మరో 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూ.19.18 కోట్ల పనులను ఈఈఎస్ఎల్ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ విస్తరిత ప్రాంతాలతో పాటు మురికివాడలు, పార్కుల్లో 8వేల కెమెరాలను ఏర్పాటు చేయనుంది. సీసీల ఏర్పాటుతో పాటు రెండేండ్ల పాటు ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించనున్నారు.
పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు హైదరాబాద్ నగర పరిధిలో ‘పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల నిర్వహణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, నగరంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ పరిధిలో ఇప్పటి వరకు సీసీ టీవీ సర్వేలెన్స్ కెమెరాలు లేని ప్రాంతాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఆదేశిస్తూ జీవోను జారీ చేశారు.
ఓఆర్ఆర్ పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లు విస్తరిస్తున్న నేపథ్యంలో ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టపరచాలనే లక్ష్యంతో ప్రస్తుతం మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ కంపెనీకి పనుల బాధ్యతలు అప్పగిస్తూ నేడు జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.