సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ ) : ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘అన్నపూర్ణ’ కేంద్రాలను ఏర్పాటు చేసి పేదల పాలిట అక్షయపాత్రగా మలిచింది. కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతూ వచ్చినది. గత ప్రభుత్వ హయాంలోనే 10 కోట్ల 88 లక్షల మందికి పైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది.. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం రూ. 216.01కోట్లు ఖర్చు చేశారు.
నగరంలో అ భాగ్యులు, పేదవారు, వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే సామాన్యుల ఆకలి తీర్చిన అన్నపూర్ణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరా’ క్యాంటీన్‌గా మార్చుతూ అధికారులు ప్రతిపాదనలు పెట్టగా గురువారం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పునరుద్ధరణ పేరుతో 23 సెంటర్లను పూర్తిగా ఎత్తేసి గడిచిన కొన్ని నెలలుగా అన్నపూర్ణ కేంద్రాల ఉనికిని ప్రశార్థకం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఇందిరా ’ క్యాంటీన్‌గా మార్చి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నది.
అన్నపూర్ణ పథకం పేరు మార్చడంపై గ్రేటర్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కారు పేరు తెచ్చి పెట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పథకాలను హెచ్ సిటీ ప్రాజెక్టుగా పేరు మార్చిన రేవంత్ సర్కారు…గడిచిన 18 నెలలుగా ఏ ఒక్క చోట ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను మొదలు పెట్టకపోవడం పాలన వైఫల్యానికి అద్దం పడుతున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కా ర్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. కమిటీ సమావేశంలో 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్లు తెలిపారు.