ఉస్మానియా యూనివర్సిటీ : సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో సాఠె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లకుండానే ఏకలవ్యుడిలా ఇష్టంగా కష్టపడి విద్యాజ్ఞానాన్ని ఆర్జించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కవి, రచయితాగా గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు.
మాంగ్ కులానికి తహశీల్దార్ కార్యాలయాల ద్వారానే కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన మాంగ్ సమాజ్ అభివృద్ధికి ప్రత్యేక మాంగ్ సమాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలు చదువుకునేందుకు గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. ఏజెన్సీలో నివసించే మాంగ్ ప్రజలకు పాత పహాణీ పత్రాల ఆధారంగా రైతులకు లభించే అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గైక్వాడ్ తులసీదాస్ మాంగ్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్, వివిధ సంఘాల నాయకులు రాజేశ్, చందు, అమృతం కళ్యాణ్, రాంబాబు, వెంకట్, సతీష్, శేఖర్, విజయ్, సాయికిరణ్, విక్రమ్ గైక్వాడ్, చంద్రశేఖర్ మాంగ్, సుధాకర్ మాంగ్, దిలీప్ మాంగ్, ఉద్దవ్ మాంగ్, అనిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.