ఖైరతాబాద్, మే 26 : ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు అంకురార్పణ జరుగనున్నది. జూన్ 6న నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్ర పూజ క్రతువు నిర్వహించనున్నారు. మహాగణపతి ప్రతిష్ఠాపనోత్సవం 70 ఏండ్లు పూర్తి చేసుకొని ఈ ఏడాది 71 వసంతంలోకి అడుగుపెడుతోంది. ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించే ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్ కోరారు.
కాగా, గతేడాది గణేశ్ ఉత్సవ కమిటీ నుంచి కొందరు సభ్యులు వేరుగా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్సవాల ఏర్పాటులో తమకు భాగస్వామ్యం దక్కడం లేదంటూ.. ఆరోపిస్తూ గొడవకు సైతం దిగారు. ఉత్సవ కమిటీ ఆవిర్భావం తామే చేశామని, దానికి పూర్తి హక్కుదారులు తామేనంటూ దివంగత చైర్మన్ వారసులు చెబుతుండగా, అనేక ఏండ్లుగా తాము కూడా ఉత్సవాల్లో భాగస్వామ్యం వహిస్తున్నామని, కమిటీ సభ్యులుగా ఉన్నామని, కానీ ఒకే కుటుంబం ఆ బాధ్యత ఎలా తీసుకుంటుందని కొత్తగా ఏర్పడిన కమిటీ ప్రశ్నిస్తోంది. కర్రపూజ కోసం రెండు కమిటీలు పోటీ పడుతాయా, లేక సమన్వయం పాటించి భక్తుల మనోభావాలను గౌరవిస్తాయా అనేది వేచిచూడాల్సిందే.