అబిడ్స్, మే 12: పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం కోటి రూపాయలు అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం గోషామహల్ నియోజకవర్గ పరిధి మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూం ఇండ్ల భవన సముదాయాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావుతో కలిసి మంత్రులు తలసాని, మహమూద్ అలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మురళీధర్‌బాగ్‌లో మూడు బ్లాకుల్లో నిర్మించిన డబుల్ ఇండ్లలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదిరి లిఫ్ట్‌తో పాటు సకల సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్మించిన ఒక్కో ఇంటి విలువ మార్కెట్ రేట్ ప్రకారం కనీసం కోటి రూపాయలు ఉంటుందన్నారు. ఈ భవన సముదాయ మెయింటెనెన్స్ కోసం నిర్మించిన షాపులను స్థానికులకే ఇస్తామన్నారు. ఈ నివాసాలను ఎవరూ అమ్ముకోవద్దని ఓ వేళ ఎవరైనా అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయంటే అతిశయోక్తి కాదన్నారు. శాసనమండలి విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో లబ్ధిదారులకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, జాంబాగ్ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్, మంగళ్‌హాట్ కార్పొరేటర్ ఎం.శశికళ కృష్ణ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్ఈలు సురేష్, విద్యాసాగర్, ఈఈ వెంకట్‌దాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ కుమార్, ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్, అశీశ్కుమార్ యాదవ్, బేగంబజార్ డివిజన్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ పూజావ్యాస్ బిలాల్, మాజీ కార్పొరేటర్లు ముఖేశ్‌సింగ్, పరమేశ్వరిసింగ్, రాంచంద్రరాజు, ఆల పురుషోత్తం రావు, గోషామహల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి పాల్గొన్నారు.