సుల్తాన్ బజార్, జూన్ 4 : పశు వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత రానివ్వకుండా, ఉన్న మందులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం యాచారం పశు వైద్యశాలను రంగారెడ్డి జిల్లా పశు వైద్యాధికారి డా. బాబు భేరితో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన పశు వైద్యశాలలో ఉన్నటువంటి మందులను పరిశీలించడంతో పాటు రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశు వైద్యానికి అవసరమైన మందుల కొరత రాకుండా, ఉన్నటువంటి మందులను సక్రమంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి పశు అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న పశు వైద్య సిబ్బంది అందరూ సమయానికి వచ్చి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని లేనిచో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.