బంజారాహిల్స్, డిసెంబర్ 26: బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రం స్థలం కబ్జా వ్యవహారంలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అంగన్వాడీ కోసం కేటాయించిన స్థలం తమదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు గత కొన్నిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బస్తీవాసులు అనేకసార్లు కబ్జాను అడ్డుకోవడంతో పాటు ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో నిందితులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు సైతం నమోదైంది.
అయినప్పటికీ మరోసారి శుక్రవారం కొందరు ప్రైవేటు వ్యక్తులు స్థలంలోకి ప్రవేశించడంతో బస్తీవాసులు పెద్ద ఎత్తున గుమిగూడి వారితో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితిల్లో అంగన్వాడీ స్థలాన్ని వదిలిపెట్టేది లేదని బస్తీవాసులు హెచ్చరించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని ప్రైవేటు వ్యక్తులను పంపించి వేశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టి భవిష్యత్‌లో అంగన్వాడీ స్థలం కబ్జాదారుల చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.