ఖైరతాబాద్,అక్టోబర్ 17:నిమ్స్ దవాఖానలో అనస్థీషియా టెక్నీషియన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కుల్చారం మండలం తుమ్మలపల్లి తండాకు చెందిన రమావత్ లక్ష్మణ్, అనసూయ దంపతుల మూడో సంతానం నితిన్(22)నిమ్స్ వైద్య కళాశాలలో బీఎస్సీ అనస్థీషియా టెక్నీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బోరబండలో హాస్టల్లో ఉంటూ దవాఖానలోనే ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. గురువారం రాత్రి నిమ్స్ న్యూరో సర్జరీ విభాగంలో అత్యవసర శస్త్ర చికిత్స ఉండటంతో విధులకు వచ్చాడు. అనంతరం పై గదిలో విశ్రాంతి కోసం వెళ్లాడు. ఉదయం చూసే సరికి విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిమ్స్‌లో బీఎస్సీ అనస్థీషియ టెక్నీషియన్ చివరి సంవత్సరంలో ఒక ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. వచ్చే స్టయిఫండ్తోనే నితిన్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చే ముందు కూడా ఎంతో ఉత్సాహంగా ఫోన్లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంత కాలంగా యాజమాన్యం వేళాపాళా లేని డ్యూటీలు వేస్తున్నారని, చివరకు బంధువుల వివాహం కోసం ఇటీవల ఇంటికి వస్తే తక్షణమే డ్యూటీలో చేరాలంటూ ఓ ఇన్చార్జి ఒత్తిడికి గురిచేశాడని మృతుడి బావమరిది రాజు నిమ్స్‌లో మీడియా సమావేశంలో ఆరోపించారు. నితిన్‌ను గతేడాది సెల్‌ఫోన్ దొంగిలించాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసి ఒక రోజు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని, చివరకు ఆ ఫోన్ వేరే చోట దొరకడంతో అతడిని వదిలేశారని చెప్పారు. దొంగతనం కేసు వీగిపోయినా కొందరు దొంగ అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ విషయం తమ దృష్టికి తీసుకువచ్చాడని తెలిపారు. నితిన్ మృతిపై తమకు అనేక అనుమానాలున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
నితిన్ మరణవార్త తెలుసుకున్న తోటి సిబ్బంది,ఇతర టెక్నీషియన్లు నిమ్స్‌లో ఆందోళనకు దిగారు. ఒత్తిడితో చనిపోయాడంటూ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తక్షణమే నిరసన విరమించాలని, లేని పక్షంలో లోపలేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా మృతదేహాన్ని సైతం నిమ్స్ దవాఖానలోని ఓ బ్యాక్ డోర్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.