సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) ఉప్పల్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంటే.. ఉప్పల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం కనిపించడం లేదు. ఉప్పల్‌లో నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా..? అసలు ఉప్పల్‌కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారా ? అసలు పోటీ చేస్తుందా? అన్న అంశాలపై రోజు రోజుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఉప్పల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ప్రచారంలో దూసుకు పోతుంటే.. మిగిలిన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు మాత్రం ఇంత వరకు ఖరారు కాలేదు.
బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థితో పాటు క్యాడర్ కూడా డివిజన్ల వారీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని గత నెలలో ఖరారు చేసినప్పటి నుంచే ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. అధికార పార్టీ ప్రచారం ఈ విధంగా ఉంటే.. ప్రతిపక్ష పార్టీలలో అభ్యర్థులు ఎవరో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా కమలం పార్టీలో ఎలాంటి కదలికలేదు. ఉప్పల్‌లో బీజేపీ అభ్యర్థి ఖరారు కాలేదు. దీంతో స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా ప్రచారం చేయడంలో వెనుకపడ్డారు. ఎన్నికల ప్రచారం ఎక్కడా కనిపించడంలేదు. పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నా.. ప్రచారంలో ముందుకురావడం లేదు. గతంలో ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ అడపా దడప కార్యక్రమాలు చేస్తున్నా.. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలోకి రావడంలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థి తెలియకపోవడం, ప్రచారంలో ముందుండి నడిపించే వ్యక్తి లేకపోవడంతో కాషాయదళం నేతలు తీవ్ర అయోమయంలో పడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి 2009, 2018 ఎన్నికల్లో అరకొర ఓట్లే లభించాయి. 2009లో 17,394 ఓట్లు రాగా.. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 26,798 ఓట్లు లభించాయి. టీడీపీతో బీజేపీ పొత్తులో భాగంగా 2014లో బీజేపీకి ఉప్పల్ టికెట్ కేటాయించగా విజయం సాధించారు. జీహెచ్ఎంసీకి జరిగిన 2016 ఎన్నికల్లోనూ బీజేపీ ఒక్క సీటు కూడా గెలువలేక పోయింది. ఆశించిన ఓట్లను రాబట్టలేకపోయింది. 2020 జరిగిన ఎన్నికల్లో గ్రేటర్లో బీజేపీకి కొంతమేర సీట్లు పెరిగినా.. ఉప్పల్ నియోజకవర్గంలో 10 సీట్లలో కేవలం 2 మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ ఒంటరిగా పోటీచేసినప్పుడు ఓట్లను రాబట్టలేకపోయింది. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని రాజకీయవర్గాలో చర్చ జరుగుతున్నది. బీజేపీ అసెంబ్లీ సమరంపై ప్రచారం ప్రారంభించకపోవడంపై నేతలు, కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు.