‘మా ఓట్లతో గెలిచిన రేవంత్ ఎక్కడ దాక్కున్నావ్’. ఎందుకు మాట్లాడతలేవు.? అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కనిపిస్తలేవా? ఓట్లు వేస్తే గెలిచిన మాపై ఎందుకింత కర్కశంగా ప్రవర్తిస్తున్నావ్. ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చిన విషయం మరిచినవ’?.. సీఎం రేవంత్‌పై ఓ నిరుద్యోగి ఆగ్రహమిది. జీవో నం. 29 రద్దు చేసిన తర్వాతే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలంటూ.. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలతో అశోక్‌నగర్ కొన్ని రోజులుగా అట్టుడుకుతున్నది. అయితే ప్రజాపాలనలో నిరుద్యోగులపై పోలీసుల లాఠీ దెబ్బలు.. అక్రమ నిర్బంధాలు, అరెస్టులు.. తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి.
-సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ)
కొన్ని రోజులుగా అశోక్‌నగర్ నిరసనలతో హోరెత్తుతున్నది. ఈ క్రమంలో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు శనివారం సచివాలయానికి చేరుకున్నాయి. పోలీసు బలగాలు నిలువరించే ప్రయత్నాలను నిరుద్యోగులు పటాపంచెలు చేస్తూ సచివాలయానికి దూసుకుపోయారు. వందలాదిగా వచ్చిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన చలో సెక్రటేరియట్ ర్యాలీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా నిలిచారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
డౌన్ డౌన్ సీఎం నినాదాలు
పోలీసుల నిర్బంధాలు ఓ వైపు, డౌన్ డౌన్ సీఎం నినాదాలతో సచివాలయం, అశోక్‌నగర్ పరిసరాలు దద్దరిల్లాయి. నిరుద్యోగుల ఓట్లతో గెలిచి, ముఖ్యమంత్రి అయినా రేవంత్‌రెడ్డిపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.