School Books | సిటీబ్యూరో: అవసరం ఉన్నా..లేకున్నా.. పుస్తకాలు కొనిపించి.. పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నాయి పాఠశాలల యాజమాన్యాలు. కేవలం తరగతికి సంబంధించిన పుస్తకాలే కాకుండా అదనంగా కొనుగోలు చేయిస్తూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజుతున్నాయి. దీంతో వయసుకు మించి బరువున్న బ్యాగులను మోస్తూ విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విద్యాశాఖ స్కూల్ బ్యాగుల బరువుపై గతంలో ఎంత ఉండాలో తరగతి లెక్కన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ నిబంధనలను పాఠశాలలు గాలికొదిలేశాయి. అధిక బరువు బ్యాగులు మోయడం వల్ల విద్యార్థులు వంగి నడవడం, ఎముకలు అరగడం తదితర సమస్యలతో బాధపడుతున్నట్టు విద్యాశాఖ అధికారులకు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 7 నుంచి 17 కిలోల వరకు స్కూల్ బ్యాగుల బరువు ఉంటున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సైదాబాద్: సైదాబాద్ జయనగర్లోని సెయింట్ అండ్రూస్ పాఠశాల ఆవరణలో బుధవారం పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న గదిని సైదాబాద్ జోన్ విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సైదాబాద్ జోన్ ఉప విద్యాశాఖ అధికారి తిరునగరి రాధాకృష్ణ అదేశాల మేరకు అధికారులు పాఠశాలలో తనిఖీ చేసి.. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఉన్న గది సీజ్ చేశారు.