సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో అధికార వికేంద్రీకరణ పేరుతో తీసుకున్న నిర్ణయాలు అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. గ్రేటర్‌ను పరిశుభ్రంగా ఉంచాల్సిన యంత్రాంగం.. ఇప్పుడు అంతర్గత ఆధిపత్య పోరులో మునిగిపోయింది. పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను వైద్యాధికారుల నుంచి తప్పించి, ఇంజినీరింగ్ విభాగానికి కట్టబెట్టడం.. ఇదే ఇంజినీర్లు సర్కిల్ అధికారులపై పెత్తనం చెలాయిస్తుండడంతో పెను దుమారం రేపుతున్నది. శానిటేషన్‌కు సంబంధించి అన్నీ అంశాలను తామే చూసుకుంటామని, డిప్యూటీ కమిషనర్లకు రిపోర్టు చేయబోమని కొందరు ఇంజినీర్లు పట్టుపడుతుండడంతో డిప్యూటీ కమిషనర్లు వర్సెస్ ఇంజినీర్లుగా ఈ వివాదం రాజుకుంటున్నది.
సర్కిళ్ల వారీగా..
జీహెచ్ఎంసీలో సర్కిళ్ల వారీగా ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌లతో పాటు పారిశుధ్య పనుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్లే కీలకం. వైద్యాదికారులు, డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో శానిటేషన్ నిర్వహణ ఉండేది. అయితే ఇటీవల కమిషనర్ శానిటేషన్ నిర్వహణ బాధ్యతలను వైద్యాధికారుల నుంచి తప్పించి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య కార్మికుల హాజరు నుంచి వారీ జీతాలు మొదలుకొని, చెత్త తరలింపు పర్యవేక్షణ వరకు అన్ని బాధ్యతలపై ఇంజినీర్లు తమ ఆధీనంలో తీసుకుంటున్నారు. డిప్యూటీ కమిషన్ల పరిధిలో తాము ఉండబోమని, శానిటేషన్ వర్కర్ల జీతాలు, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రాంకీ ఏజెన్సీకి బిల్లులు తమ ద్వారానే వెళ్లాలని పట్టుబడుతున్నారు.
దీనిపై ఇంజినీర్ల వ్యవహార శైలిపై కొన్ని సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు భగ్గుమంటున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల ఇంజినీర్లు ట్రేడ్ లైసెన్స్‌లు సైతం బాధ్యత మేమే తీసుకుంటున్నామని అందులోనూ జోక్యం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే కవాడిగూడ, ఉప్పల్ తదితర సర్కిళ్లలో ఇంజినీర్లు సంబంధిత ఎస్‌ఎఫ్‌ఏలపై ఒత్తిడి పెంచి పర్సంటేజీల పర్వానికి తెరలేపినట్లు ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా అధికారుల మధ్య అంతర్గత పోరు పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం చేసే మార్పులు అవినీతికి మార్గదర్శకాలుగా మారకూడదని, వెంటనే కమిషనర్ జోక్యం చేసుకుని ఈ అంతర్గత పోరుకు చెక్ పెట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.