బంజారాహిల్స్, మే 26 :అమ్మచెప్పింది.. అర్జెంట్‌గా ఇంటికి రండి అంటూ కూతురు ఓ వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి చితకబాదిన ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన ఆర్య జయచంద్ర ప్రైవేటు ఉద్యోగి. అతడితో పాటు పనిచేస్తున్న మహిళతో కొంతకాలంగా స్నేహం ఉంది. మహిళ తన భర్తతో విబేధాల కారణంగా వేరుగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఈనెల 22న మహిళ కుమార్తె జయచంద్రకు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రావాలని అమ్మ చెప్పిందంటూ పిలిపించింది. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని దూద్‌ఖానా బస్తీలోని ఆమె ఇంటికి జయచంద్ర వచ్చాడు.
అకస్మాత్తుగా మహిళ బంధువులు అక్కడకు వచ్చారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ జయచంద్రతో పాటు సదరు మహిళను చితకబాదారు. ఆమె కుమార్తె సైతం అతడిపై దాడి చేయడంతో పాటు బైక్ ధ్వంసం చేశారు. ఈ గొడవలో అతడి మెడలోని 12గ్రాముల బంగారు గొలుసు కూడా కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన జయచంద్ర సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో సదరు మహిళ సన్నిహితంగా ఉంటున్న విషయం ఆమె భర్తకు సైతం తెలుసంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.