బంజారాహిల్స్, జనవరి 26: నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్‌లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పెద్దసంఖ్యలో వెలిసిన ఆక్రమణలను ఆరునెలల కిందట షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది తొలగించిన సంగతి తెలిసిందే. సుమారు ఎకరం విస్తీర్ణంలో అడుగడుగునా అక్రమ నిర్మాణాలు రావడంతో నందినగర్ బస్‌స్టాప్‌కు ఆర్టీసీ బస్సులు వచ్చేందుకు నిలిచిపోయాయి. దీంతో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనాలతో ఆరునెలల కిందట నందినగర్ గ్రౌండ్స్‌లోని ఆక్రమణలను కూల్చేశారు. కాగా స్థలంలో ఆక్రమణలను తొలగించిన తర్వాత నందినగర్ గ్రౌండ్స్‌లో పశ్చిమం వైపున స్థలాన్ని ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం టీజీఎస్పీడీసీఎల్కు కేటాయించారు.
తాజాగా నందినగర్ గ్రౌండ్స్‌లోని తూర్పు వైపున హనుమాన్ ఆలయాన్ని ఆనుకుని సుమారు 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థలం చుట్టూ రాళ్లతో సుమారు మూడు అడుగుల ఎత్తులో రాళ్లను పేర్చడంతో పాటు లారీల్లో మట్టిని తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారు. సుమారు ఎకరం విస్తీర్ణంలోని నందినగర్ గ్రౌండ్స్‌లో సగం ఇప్పటికే అక్రమ పార్కింగ్లు, ఆక్రమణల బారిన పడగా ఖాళీగా ఉన్న మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించుకుంటే బస్సులు ఎలా వస్తాయని, వేలాదిమంది జనాభా ఉన్న నందినగర్, వెంకటేశ్వరనగర్ బస్తీలకు చెందిన సమావేశాలు, సభలు నిర్వహించుకునే అవకాశం లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల మద్దతుతో పట్టపగలే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదిరోజుల కిందట ప్రభుత్వ స్థలం ఆక్రమణ వ్యవహారంపై ఫిర్యాదులు అందుకున్న షేక్‌పేట మండల అధికారులు అక్కడకు వెళ్లి ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే స్థలంలోని మట్టిని, రాళ్లను తొలగించాలని హెచ్చరించారు. అయితే వారి హెచ్చరికలు ఏ మాత్రం పట్టించుకోకుండా సుమారు 1500 గజాల స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 15కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు.