సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ) : నియోపోలీస్.. గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం..ఎకరం ధర రూ. 150కోట్ల పైమాటే.. గద్దల్లా వాలిన ప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేత అనుచరులు ఈ ప్రాంతాన్ని అక్రమార్కులకు కామధేనువుగా మార్చారు. భూములను కొల్లగొట్టడం.మరొకరు నిబంధనలకు విరుద్దంగా వ్యాపారాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు..ఇప్పటికే మైనింగ్ మాఫియా మరవకముందే తాజాగా ఈ ‘నియో పోలీస్’ను టార్గెట్’ చేసింది..ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ నిబంధనలను తుంగలో తొక్కి ‘ప్రకటనల’ దందాకు ముఖ్యనేత అనుచరులు తెరలేపారు.
ఆకాశహర్మ్యాల నిర్మాణాలు..వీటిని సందర్శించే ప్రముఖులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్ వెళ్లేందుకు అనువైన రద్దీ మార్గం కావడంతో ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్నారు. అనుమతి లేకుండా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేశారు. నియో పోలీస్ కూడలి సమీపంలో మైనింగ్ వ్యాపారం చుట్టూరా ఉన్న రేకుల షెడ్లకు దాదాపు 60కి పైగా అక్రమంగా బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డుకు నెలకు రూ. 2 లక్షల చొప్పున రూ.కోటికి పైగా వ్యాపారం సాగిస్తున్నారు.
ఈ సొమ్మంతా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లాల్సింది పోయి , నేరుగా సంబంధిత అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. సాధారణంగా చిన్న బోర్డు పెడితేనే విరుచుపడే అధికారులు కోట్లాది రూపాయలు లావాదేవీలు జరుగుతున్నా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యనేత అనుచరుల ఏజెన్సీలు కావడంతో పై స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి చేస్తున్న సహకారం చర్చనీయాంశంగా మారింది. నియో పోలీస్ కేంద్రంగా ఇప్పటికే భారీ ఎత్తున మైనింగ్ దందా సాగింది.
ఈ వివాదం సద్దుమణగకముందే ఇప్పుడు అక్రమ ప్రకటనల దందా తెరపైకి వచ్చింది..నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్కు వెళ్లేందుకు సులువైన మార్గం కావడంతో రోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ రద్దీని ఆసరాగా చేసుకున్న రెండు ముఖ్య ఏజెన్సీలు సిండికేట్‌గా మారి అనధికారిక బోర్డులు ఏర్పాటు చేశారు. డిమాండ్‌కు తగ్గట్లుగా రోజుకో కొత్తగా ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేస్తూ నెలకు రూ.కోట్లలో లావాదేవీలు జరుపుతున్నారు. వాస్తవంగా ఈ నియోపోలీస్ కూడలి వద్ద ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీకి ఆస్కారం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో అనధికారికంగా ఏర్పాటుతో వచ్చిన ఆదాయం ఏకపక్షంగా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నది. అధికారికంగా ఉంటే పన్ను రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే చోట అదికారులు ఈ అనధికారిక ప్రకటన బోర్డులను తొలగించే సాహసం చేయడం లేదు. ఇదే అదనుగా సదరు బడా ఏజెన్సీలు ఇంతటితో ఆగకుండా ఈ రోడ్డు వెంబడి యూనిపోల్స్ హోర్డింగ్‌లు, క్యాంటీలివర్స్ ఏర్పాటుకు సమాయత్తమవుతున్న తీరు అధికార యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తున్నది.