సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో దోమలు(Mosquitoes) ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్లను గుర్తించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ యుసిడి, హెల్త్, చీఫ్ ఎంటమాలజీ, కాల్ సెంటర్ ఓఎస్డీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి నివారణలో భాగంగా పాఠశాల, కాలేజీలలో చేపట్టే అవగాహన కార్యక్రమాలు వెంటనే పూర్తి చేసి, హాట్ స్పాట్లపై దృష్టి సారించాలని కమిషనర్ చెప్పారు.
స్వచ్ఛ ఆటో హాజరు పరిస్థితి సరిగా లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని, ఈఎంఐ పూర్తి చేసిన స్వచ్ఛ ఆటో యాజమాని సక్రమంగా హాజరు కాకుండా నిర్ధేశించిన ప్రకారంగా చెత్త సేకరణ చేయని పక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈఎంఐ పూర్తి కానీ స్వచ్ఛ ఆటో చెత్త సేకరణలో గానీ, సక్రమంగా హాజరు కానీ పక్షంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగి కేటాయింపు చేయాలని సూచించారు. యుద్ద ప్రాతిపదికన జీవీపీల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. షాపింగ్ మాల్, సినిమా థియేటర్లలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండే విధంగా, ఫైర్ సేఫ్టీ కూడా పరిశీలన చేసి సర్కిల్ వారీగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.