సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ) : ప్రజావాణిలో(Prajavani) వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) అధికారులను ఆదేశించారు. సోమవా రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చి న ఆర్జీల పరిష్కారంపై ఆయా అధికారులు దృష్టి సారించాలన్నారు. జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 25 విన్నపాలు రాగా, టెలిఫోన్ ద్వారా 4 విన్నపాలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరిం చాలని సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 30 విన్నపాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. అందులో కూకట్పల్లి జోన్లో 12, సికింద్రాబాద్లో 10, ఎల్భీనగర్లో నాలుగు, చార్మినార్ జోన్లో రెండు, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఒకటి చొప్పున విజ్ఞప్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.