సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): నగరంలో సోమవారం కురిసిన కొద్ది పాటి వానకే అమీర్‌పేట్ నుంచి మొదలుకుని నిమ్స్ వరకు మోకాళ్ల ఎత్తు వరకు రోడ్లపై వరద నీటిలో వాహనాలు మునిగే పరిస్థితి వచ్చింది. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచి ఉండటంతో రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. మైత్రీవనం సమీపంలోని నాలాలోకి ప్రవహించిన వరద జీవ నదిని తలపించింది. వర్షం మొదలైన 15 నిమిషాల్లోనే ఎస్ఆర్నగర్ నుంచి నిమ్స్ వరకు వరద నీటిలో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండాపోయింది.
తగ్గని వరద ముంపు..
ఎగువ ఉన్న కాలనీలు, బస్తీల నుంచి 3 ఫీట్ల ఎత్తులో ప్రవహించిన వరద నీరు లోతున ఉండే అమీర్‌పేట్‌కు చేరే సరికి భారీగా చేరింది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు ఇతర వాహనాలు సగం మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి గూడ, కృష్ణకాంత్ పార్క్, మధురానగర్, చర్చ్ రోడ్డు, వెంగళ్రావు నగర్, ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్‌పేట్, మైత్రీవనంలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ పక్కనే ఉండే నాలాలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక ఎస్ఆర్నగర్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారి మొత్తం కూడా మోకాళ్లలోతున నీరు గంటల తరబడి నిలిచిపోవడంతోనే అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. కురిసిన అరగంట వర్షానికే ఈ ప్రాంతం వరద ముంపునకు గురైంది.
సీఎం పర్యవేక్షించినా మారని తీరు..
మంది, మర్బాలంతో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి… ఈ ప్రాంతానికి వరద ముంపును పర్యవేక్షించారు. స్థానికులతో గంటపాటు మాట్లాడిన ఆయన, ఇక వరద సమస్య ఉండదనీ హామీ ఇచ్చారు. ఈ సీజన్లో నీట మునిగిన అమీర్‌పేట్ మైత్రీవనం ప్రాంతంలో మెరుపుతీగలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి, వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చారు. కానీ సమస్య మాత్రం తీరలేదు. కనీసం రోడ్లపై వరద నీరు నిలవకుండా ఏర్పాట్లు చేయలేకపోయారు. అమీర్‌పేట్ గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఇరువైపులా వందలాది వాహనాలు వరద నీటిలో ఇరుక్కుపోయాయి. కనీసం లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి, వరద నీటిని తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలైమంది.