Kishan Reddy | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆయనో కేంద్ర మంత్రి… సొంత రాష్ర్టానికి దేవుడెరుగు ! కనీసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించుకోలేకపోయారు. ఒకటీ అరా కాదు… ఏకంగా ఐదేండ్లుగా అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆపసోపాలు పడుతున్నాయి. దానికి సమీపంలోనే ఉప్పల్-నారాపల్లి ఫ్లైఓవర్ పనులు సైతం ఐదేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఏ ఒక్కరోజూ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. త్వరితగతిన పూర్తి చేయాలని పురమాయించిన సందర్భమూ కనిపించదు. కానీ… తన ఉనికి కోసం…అద్భుతంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఆయనే… సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు పేదల కలలను సాకారం చేస్తున్నది. ఇందులో భాగంగా అనేకచోట్ల ఇండ్లు పంపిణీ చేయగా… ప్రస్తుతం 64,108 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అయినా… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం రంగారెడ్డి జిల్లా బాట సింగారంలో పనులు జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లను సందర్శించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో… బూమరాంగ్ అయి తప్పని పరిస్థితుల్లో మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తున్నది.
Hyd3
ఈ నేపథ్యంలో బాధ్యతలు తీసుకునే ఒకరోజు ముందు ఏదో ఒక హంగామా చేసి తన ఉనికిని చాటుకోవాలని తాపత్రయ పడుతున్న కిషన్‌రెడ్డి గురువారం బాటసింగారం పర్యటన ఎంచుకున్నారు. వాస్తవానికి సుమారు రూ.68 కోట్లతో 800 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుంది. 2018లో పనులు మొదలుకాగా.. మధ్యలో కొవిడ్ కారణంగా లేబర్ దొరకకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వేలాది గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయనేది కండ్లముందు కనిపిస్తున్న సత్యం. కానీ కిషన్‌రెడ్డికి ఇవేవీ కనిపించవు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల కింద 2018లో రూ.626.80 కోట్లతో ఉప్పల్-నారాపల్లి ఫ్లైఓవర్, గోల్నాక-రామంతాపూర్ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ పనులను రూ.216 కోట్లతో ఇదే సంవత్సరంలో ప్రారంభించారు. ఇప్పటికీ కనీసం 40 శాతం కూడా ఆ పనులు పూర్తి కాలేదు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ కింద రూ.3,248 కోట్ల విలువైన ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలను నిర్మించి, అందుబాటులోకి కూడా తీసుకువచ్చింది. తాను కేంద్ర మంత్రిగా ఉండి… తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధి, గతంలో శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన అంబర్‌పేటలో ఒకటిన్నర కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను పూర్తి చేయించుకోలేని కిషన్‌రెడ్డికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జాప్యంపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందనేది సామాన్యుడి హితవు. మరి… ఆత్మ పరిశీలన చేసుకుంటారా? గురువింద గింజ చందంగా రాజకీయ డ్రామా చేస్తారా??
నారపల్లి-ఉప్పల్ మధ్య నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులకు త్వరలోనే కొంత ఉపశమనం లభించనున్నది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల గుంతలుపడి అధ్వానంగా మారిన ఈ రోడ్డును ఆర్అండ్బీ శాఖ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(ఎంవోఆర్టీహెచ్) నుంచి అనుమతి లభించింది. జాతీయ రహదారుల శాఖ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు రోడ్డు పనులు నత్త నడకన సాగుతుండడంపై బుధవారం ‘నత్తే నయం’ శీర్షికతో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి స్పందనగా జాతీయ రహదారుల శాఖ ఈ రోడ్డు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉప్పల్-నారపల్లి మధ్య 2018లో శంకుస్థాపన చేసిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు నెలకు రెండు శాతం మాత్రమే జరుగుతున్నట్లు ఆర్అండ్బీ అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో కారిడార్‌ను నిర్మిస్తున్న గాయత్రి కన్స్ట్రక్షన్స్ను తొలగించి పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ఇదివరకే ఆర్అండ్బీ అధికారులు ఎన్‌హెచ్ శాఖను కోరారు. అయినా ఫలితం లేకపోవడంతో కనీసం పాడైపోయిన రోడ్డునైనా పునరుద్ధరించడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా ఎన్‌హెచ్ శాఖ ససేమిరా అంటూ వస్తున్నది. తాజాగా ఈ అంశంపై నమస్తే తెలంగాణ కథనం ప్రచురించడంతో ఎన్‌హెచ్ శాఖ నుంచి స్పందన వచ్చింది. కాంట్రాక్టర్ ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)లోని రూ. 4 కోట్లతో రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఆ శాఖ అనుమతించింది.