హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ(Ambedkar Open University) ప్రాంగ ణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (JNFAU) కేటాయించాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించు కోవాలని అంబేద్కర్ వర్సిటీలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మెదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అన్నారు.
అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడుతూఈ విశ్వవిద్యాలయం ఎంతో మంది సబ్బండ, పేద విద్యార్థులకు దూర విద్య ద్వారా విద్యానభ్యసించుకొనే వెసులుబాటు కల్పిస్తున్నదని పేర్కొన్నారు.
విద్యార్థుల సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్స్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో అటు విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల అవసరాల కోసం బిల్డింగ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. గుట్టలు రాళ్లతో నిండిన క్యాంపస్ లో ఒక్క ఎకరం జాగా కూడా నిర్మాణాలకు అనువుగా లేదన్నారు.
ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ స్థలాలను ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్తులో తమ యూనివర్సిటీ అభివృద్ధికీ, విస్తరణకు అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఆలోచనను విరామించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ ఇంచార్జి రిజిస్ట్రార్ సుధారానికి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అన్ని ఉద్యోగ సంఘాల నాయకులూ ప్రొ. పల్లవి కాబ్దే , ప్రొ . పుష్పా చక్రపాణి , ప్రొ. మాధురి, ప్రొ. చంద్రకళ, డా. పి. వెంకట రమణ, డా. భోజు శ్రీనివాస్, డా. బానోత్ ధర్మ, డా. వెంకటేశ్వర్లు, డా. ఎల్వీకే రెడ్డి, డా. కృష్ణా రెడ్డి, ఎన్. సి. వేణు గోపాల్, నారాయణ రావు, జి. మహేశ్వర్ గౌడ్, ఎం.డి. హబీబుద్దీన్, కాంతం ప్రేమ్ కుమార్, డా .యాకేష్ దైద, రజనీ కాంత్ పాల్గొన్నారు.