బంజారాహిల్స్/ఖైరతాబాద్, మార్చి 25: పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ 14న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని తాను మంత్రి కేటీఆర్‌ను కోరానని, దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న శుభసందర్భంగా పంజాగుట్టలో కూడా స్థానికుల మనోభావాలను గౌరవిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్, జీహెచ్ఎంసీ సర్కిల్ -17 డీఎంసీ మోహన్‌రెడ్డి, ఏఎమ్వోహెచ్ డా. భార్గవ్ నారాయణ, డీఈ చైతన్య, ఏఈ చరణ్‌లతో కలిసి ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున నెక్లెస్‌రోడ్‌లో 126 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ పంజాగుట్టలో విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తున్నామని, రాజకీయాల కోసం అంబేద్కర్ గౌరవాన్ని తక్కువ చేసే ప్రయత్నాలు గతంలో జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత వనం శ్రీనివాస్‌యాదవ్, పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు పుణ్య భానుప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాడారం వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు మన్దీప్, సలహదారులు సరుగు రమేశ్, ఉత్తమ్, జగన్‌తో పాటు బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేతలు రాంచందర్, విజయ్‌కుమార్, నిరంజన్, అరుణ్‌కుమార్, నాగేశ్వర్రావు, మెట్టు రాజు, సత్యనారాయణ గౌడ్. తాటి రాములు. సంపంగి కిరణ్పాల్గొన్నారు.