అల్వాల్, జూన్ 27 : అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. దీంతో రోగులు అవస్థలుపడుతున్నారు. అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం, లోతుకుంట వివిధ ప్రాంతాల ప్రజలు నిత్యం ప్రజలు ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఓపీ మొదలవ్వాలి కానీ.. 11 గంటలు అయినా.. వైద్యులు రాకపోవడంతో కుర్చీలు బోసిగా దర్శనమిస్తున్నాయి.
జ్వరం,దగ్గు బీపీ, ఘగర్ సమస్యలతో వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్నారులు వైద్యుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.ప్రతిరోజూ ఇదే తంతు నడుస్తున్నది. ‘ప్రతిరోజూ 8 గంటలకు వచ్చి క్యూలో నిలబడతాం.. 11.00 అయినా డాక్టర్లు రారు. ప్రభుత్వం జీతం ఇచ్చేది పేదలకు సేవ చేయమనే కదా.. ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటే ఎలా.. వీళ్లపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలి.. డాక్టర్లు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలి’.. అని స్థానికుడు సురేందర్‌రెడ్డి అన్నారు.