మన్సూరాబాద్, జనవరి 17: ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో జరుగుతున్న అండర్‌పాస్ రోడ్డు నిర్మాణం, రోడ్డు వెడల్పు పనులతో ఎల్బీనగర్ పీఎస్ కొంత మేరకు తొలగించాల్సిన వస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్‌ను వేరే ప్రాంతంలో నిర్మించేందుకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు వెడల్పు పనులతో తొలగించనున్న ఎల్బీనగర్ పీఎస్ నిర్మాణానికి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం పక్కన పెట్రోల్ బంకు వద్ద ఉన్న పౌర సరఫరాల శాఖకు చెందిన స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే సోమవారం బీసీ వెల్ఫేర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండోర్ స్టేడియం పక్కన పెట్రోల్ బంకు వద్ద ఉన్న పౌర సరఫరాల శాఖకు చెందిన సుమారు 2484 స్కేర్ మీటర్ల స్థలాన్ని ఎల్బీనగర్ పీఎస్ భవనం కోసం కేటాయించాలని మంత్రి గంగుల కమలాకర్‌ను కోరామన్నారు. మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. స్థలం కేటాయింపు జరగగానే పోలీస్ స్టేషన్‌ను అన్ని సదుపాయాలతో నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్బీనగర్ పీఎస్ సీఐ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.