మియాపూర్, సెప్టెంబర్ 29 : కులం మతం ప్రాంతం రాజకీయాలకు అతీతంగా పేదరికమే అర్హతగా డబుల్ ఇండ్ల కేటాయింపులు జరిగినట్లు విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నిరుపేదల కండ్లలో సీఎం కేసీఆర్ డబుల్ ఆనందాన్ని నింపారని, లబ్దిదారుల సంతోషానికి అవధుల్లేవన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మూడు విడతలుగా నిర్వహించిన డబుల్ ఇండ్ల డ్రా ద్వారా ఎంపికైన 2816 లబ్దిదారులతో ఆత్మీయ సమావేశం శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్‌రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డిలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల పక్షపాతియని, వారి సంక్షేమం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిన ఏకైక సమర్థత కలిగిన పాలకుడు సీఎం కేసీఆర్ అని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. విప్ గాంధీ మాట్లాడుతూ నానాటికీ పెరుగుతున్న స్థలాల ధరల నేపథ్యంలో నిరుపేదలకు భారంగా మారిన సొంతింటి కలను సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా నిజం చేశారన్నారు.
నియోజకవర్గంలో మూడు విడతలలో 2816 మంది డబుల్ లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, అక్టోబరు 2 , 5 తేదీలలో ఇండ్ల కేటాయింపు చేపడుతామని విప్ గాంధీ తెలిపారు. మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా పూర్తి సాంకేతికతతో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్ రూం పథకమని, డబుల్ ఇండ్ల ఆవాసాల వద్ద లక్షలాది రూపాయల నిధులను వెచ్చించి సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక్క దరఖాస్తుతో లక్షల విలువైన సొంత ఇంటిని పేదలకు కానుకగా సీఎం కేసీఆర్ అందించారని, నియోజకవర్గ లబ్ధిదారుల తరపున విప్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ పథకమే కాకుండా గృహలక్ష్మి పథకం ద్వారా సొంతింటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని సైతం అందిస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అల్పాహారం అందించారు. స్వయంగా విప్ గాంధీ లబ్ధిదారులకు అల్పాహారాన్ని వడ్డించారు. లబ్దిదారులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు.