మేడ్చల్, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ‘రెండేండ్లుగా డంపింగ్ యార్డ్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. సమస్యలు ఎక్కడి అక్కడే పేరుకుపోయిన జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన రావడంతో రెండన్నర లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు ప్రత్యేక గ్రాంట్ కింద రూ. 1000 కోట్లు ప్రభుత్వం కేటాయించేలా జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు చర్యలు తీసుకోవాలి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు డంపింగ్ యార్డ్‌ను పరిశీలిస్తే అన్ని సమస్యలు తెలుస్తాయి. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల నుంచి చెత్త అంతా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్కే తరలిస్తున్నందున భారీగా నిధులు కేటాయించాలి’ అని మల్లారెడ్డి అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన రాకుండా తీసుకున్న చర్యలను మల్లారెడ్డి శాసనసభలో వివరించారు. ‘ చెత్త వల్ల దుర్వాసన రాకుండా చెత్తను వినియోగించి రూ. 5 వందల కోట్ల నిధులతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, రూ. 144 కోట్లతో క్యాపింగ్, వర్షాలు పడితే డంపింగ్ యార్డ్ నుంచి మురుగు నీటి పరిష్కారానికి రూ. 250 కోట్లతో నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు దుర్వాసన రాకుండా చేశాం. ఇప్పుడు అంతా పరిస్థితి తారుమారైంది. మేడ్చల్ నియోజకవర్గంలోని ఉన్న 61 గ్రామ పంచాయతీను మూడు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపారు. జీహెచ్ఎంసీలో ఎందుకు వీటిని విలీనం చేశారో అర్థం కావడం లేదు’ అని మల్లారెడ్డి వివరించారు. ఘట్కేసర్లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని చెప్పారు.