ఖైరతాబాద్, జూన్ 23: నిమ్స్ దవాఖాన లేబర్ కాంట్రాక్ట్ టెండర్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలోనే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ వైద్యశాలగా పేరొందిన నిమ్స్ దవాఖానలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలతో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్సలు ఇక్కడ పూర్తి ఉచితంగా అందుతున్నాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న వైద్యశాల ప్రతిష్ట.. కొందరు వైద్యాధికారుల అవినీతి దాహంతో మసకబారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లేబర్ కాంట్రాక్ట్ టెండర్ల కేటాయింపులో కొందరు అధికారులు పెద్ద ఎత్తున తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ అర్హత లేని రాష్ర్టేతర సంస్థకు అప్పగించిన ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారినట్లు సమాచారం.
నిబంధనలు గాలికి..
నిమ్స్‌లో లేబర్ కాంట్రాక్ట్ కోసం గతేడాది జూలైలో టెండర్లను ఆహ్వానించారు. నిమ్స్‌లాంటి దవాఖానలో లేబర్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే అనేక కఠినమైన నిబంధనలు ఉన్నాయి. టెండరులో పాల్గొనే సంస్థ కనీసం 500 బెడ్లు కలిగిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో గడిచిన మూడు సంవత్సరాల కాలంలో 500 మందికి తగ్గకుండా పేషెంట్ కేర్ సిబ్బందిని నిర్వహించిన అనుభవాన్ని నిరూపించే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
అయితే చెన్నైకి చెందిన ఆ సంస్థకు అలాంటి అర్హతలు లేవని, చెన్నైలోని కొన్ని ఆస్పత్రులతో పాటు నగరంలోని ఓ సర్కార్ దవాఖానలో లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే నిర్వహించారని, కానీ.. అన్ని అర్హతలున్నట్లు ఫేక్ పత్రాలతో టెండర్లు దక్కించుకున్నట్లు పాత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కంపెనీస్ యాక్ట్-2013 కింద నమోదు చేసిన మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ప్రాపర్టీ మేనేజ్మెంట్, భవనాల నిర్వహణ, హౌజ్‌కీపింగ్, సెక్యూరిటీ సర్వీసులకు మాత్రమే ఆ సంస్థ పరిమితమని చెబుతున్నారు. పేషెంట్ కేర్ సర్వీసులు, అస్పత్రుల్లో రోగుల సంరక్షణ, క్లినికల్ సపోర్ట్ సేవలు లేదా వైద్య సంబంధిత సహాయక సేవల నిర్వహణ లాంటి అంశాలు ఆ సంస్థ ప్రధాన లక్ష్యాల్లో ఎక్కడా ప్రస్తావించలేదంటున్నారు.
గతంలోనూ ఆరోపణలు..
చెన్నైకి చెందిన సదరు సంస్థ గతంలో నగరంలోని ప్రతిష్ఠాత్మక ఓ సర్కార్ దవాఖాన కాంట్రాక్ట్ దక్కించుకుంది. అయితే అందులోనూ కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో అధికారుల తీరుపై నిరసన కార్యక్రమాలు కూడా జరిగినట్లు తెలిసింది. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థ ప్రతిష్ఠాత్మక నిమ్స్ దవాఖానలో లేబర్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం వెనుక ఆస్పత్రిలోని పెద్దలు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సదరు సంస్థ సమర్పించిన అనుభవ సర్టిఫికెట్‌లోనూ నిబంధనల ప్రకా రం గత ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌తో కాకుండా ఆర్ఎంవో సంతకంతో ధృవీకరించిన పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. సదరు చెన్నై సంస్థకు టెండరు దక్కడం వెనుక పెద్ద గూడుపుఠాణి జరిగినట్లు చెబుతున్నారు. అర్హతలు, అనుభవం లేకున్నా టెక్నికల్ మూల్యాంకనంలో ని మ్స్ ఆస్పత్రి పెద్దలు అధిక మార్కులు కేటాయించి టెండర్లు దక్కేలా చేశారని పాత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
రూ.1.50 కోట్ల డీల్….?
నిమ్స్ లేబర్ కాంట్రాక్ట్ అర్హత లేని రాష్ర్టేతర సంస్థకు అప్పగించడంతో పాటు కేటాయింపులో పారదర్శకతను పక్కన పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థకు కట్టబెట్టేందుకు దవాఖానకు చెందిన యాజమాన్య పెద్దలతో పాటు ఇద్దరు వైద్యాధికారులు, ఆ శాఖ పేషీలో వ్యక్తిగత బాధ్యతలు చూసే ఒకరు, చివరకు నిమ్స్‌లో అవినీతి అక్రమాలను వెలికి తీసి సమాజాన్ని ప్రభావితం చేయాల్సిన బాధ్యతలో ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు సైతం భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రూ.1.50 కోట్ల డీల్ కుదిరినట్లు పేరు చెప్పడం ఇష్టపడని వైద్యుడొకరు ఆరోపించారు.