కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 8 : రాజకీయ కక్షతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ మంత్రి కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టి దర్యాప్తుల పేరుతో వేధిస్తున్నారన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి చాటి చెప్పింది కేటీఆర్ అని, నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకుడిపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి.. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పోలీసుల సమక్షంలోనే దాడు చేసుకోవడం ఇందులో భాగమేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడరని చెప్పారు. కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతారని, నిజాయతీని నిరూపించుకొని.. మచ్చలేని నాయకుడిగా బయటికి వస్తారన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు.