GHMC | సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో నెల రోజులకు పైగా అహర్నిశలు కష్టపడిన ఎన్యుమరేటర్లకు బల్ధియా చుక్కలు చూపిస్తున్నది. సర్వేలో భాగస్వామ్యం చేసిన అధికారులు వారికి చెల్లించాల్సిన నగదును సకాలంలో ఇవ్వడం లేదు. ఆదేమంటే బడ్జెట్ లేదంటూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా వాళ్లను ప్రదక్షిణలు చేయిస్తున్నారు. గ్రేటర్‌తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 23, 194 మంది ఎన్యుమరేటర్లు 28, 28, 682 గృహాలపై సర్వే చేశారు.
స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జి) మహిళలు, టీచర్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిపి ఎన్యుమరేటర్లగా బాధ్యతలు అప్పగించారు. సర్వేలో పాల్గొన్నందుకు ఎనుమలేటర్లకు రూ.10వేల పారితోషికం, సూపర్వైజర్లకు రూ.12వేలు అందించాలని నిర్ణయించారు. కానీ రెండు నెలలు కావొస్తున్నా వారికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్యూమరేటర్లు కమిషనర్ ఇలంబర్తి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. సకాలంలో చెల్లించకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే కార్యాచరణకు సిద్దమవుతున్నారు. ఎన్యూమరేటర్లకు తోడుగా ఆపరేటర్లు సైతం ఈ జాబితాలో ఉండడం గమనార్హం.