సిటీబ్యూరో, జనవరి 1 ( నమస్తే తెలంగాణ): కొత్త ఏడాది తొలిరోజు నగరంలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం వేకువజాము నుంచే పుణ్యక్షేత్రాల్లో భక్తులు బారులు తీరారు. ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. నూతన ఆశయాలను నెరవేర్చమని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోనే తొలి బంగారపు ఆలయం బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లోని హరే కృష్ణ స్వర్ణదేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవాలయం, పెద్దమ్మ టెంపుల్, సికింద్రాబాద్ గణేశ్ ఆలయం, బిర్లామందిర్, చిలుకూరు బాలాజీ, కీసరగుట్ట తదితర ప్రధాన ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మికశోభ పరిఢవిల్లింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.