సిటీబ్యూరో, అక్టోబర్ 4 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. వర్షం పడితే ఎక్కడ ఏ గుంత, మ్యాన్ హోల్ ఉందో తెలియని దుస్థితి. వీటిపై నగరవాసులు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తాజాగా ఓ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మెహిదీపట్నం దర్గా వద్ద ఉన్న గుంతలో ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి.
ఆ బస్సును గుంతలో నుంచి తీసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. బస్సు అడుగుబాగం మొత్తం గుంత పక్కనున్న రోడ్డుపై భాగానికి తాకింది. అరగంటకు పైగా మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కొందరు ప్రయాణికులు బస్సును గుంతలో నుంచి పైకి నెట్టడానికి యత్నించారు. చివరికి డ్రైవర్ ఆ బస్సును ఆపరేట్ చేసి వెనక్కి తీసుకొని గుంత తప్పించాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. నెటిజన్లు రేవంత్ పాలన అధ్వానమంటూ పోస్టులతో విరుచుకుపడ్డారు.
బస్సు పై భాగానికి చిల్లు..!
పండుగపూట డొక్కు బస్సులు నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలను ఆర్టీసీ గాలికొదిలేస్తున్నది. పండుగ వేళ.. రెట్టింపు చార్జీలతో డొక్కు బస్సులతో సర్వీసులు నడుపుతున్నది. శనివారం హనుమకొండ నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సు మార్గమధ్యలో వర్షం పడటంతో బస్సు పై భాగం అద్దానికి చిల్లులు పడ్డాయి. దీంతో వర్షం నీళ్లు బస్సులోకి చేరాయి. సీట్లలో కూర్చొన్న ప్రయాణికులంతా ముందు భాగం వైపునకు వచ్చి నిల్చొనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణికులంతా ఇలాంటి బస్సులను నడపడమేంటని డ్రైవర్, కండక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరికొన్ని సర్వీసులు బ్రేక్ డౌన్ అయి రోడ్డు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. మరో బస్సు వచ్చే వరకు గంటల తరబడి సమయం పడుతున్నదని ప్రయాణికులు చెబుతున్నారు.
డ్రైవర్ల నియామకం ప్రైవేటుకు..
గ్రేటర్లో ఇప్పటి వరకు 265 ఎలక్ట్రిక్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి నిర్వహణ, డ్రైవర్ల నియామకం అంతా ఓ ప్రైవేటు కంపెనీకే ప్రభుత్వం అప్పగించింది. అయితే ఆ డ్రైవర్లు సుశిక్షితులా కాదా అనేది ఆర్టీసీకి సంబంధం లేదు. ఆ కంపెనీ ఇచ్చే శిక్షణతోనే ఆ బస్సులను నడుపుతున్నారు. వారికి సరైన అవగాహన లేకపోతే ప్రమాదం సంభవించికుండా బస్సులను నడపడం చాలా కష్టతరమైనది. మరో 275 ఈవీ బస్సులు కూడా రానున్నాయి. దీంతో నెమ్మదిగా బస్సులన్నీ ప్రైవేటు పరం కాబోతున్నాయని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.