సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) ;గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సిద్ధమైంది. గణేశ్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం.. మహా నిమజ్జనం నేడే జరుగనున్నది. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో రూ. 30 కోట్ల వ్యయంతో సకల వసతులు కల్పించారు. వినాయక నిమజ్జనానికి ఆర్టీఏ 2వేల వాహనాలను ఏర్పాటు చేయగా, జీహెచ్ఎంసీ 256 క్రేన్లను సిద్ధం చేసింది. అలాగే పారిశుధ్య నిర్వహణకు 3వేల మంది సిబ్బందిని మూడు షిప్టుల్లో ఏర్పాటు చేశారు. జలమండలి 33.50 లక్షల తాగునీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచగా, ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఉదయం 7గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30లోపే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం పూర్తికానున్నది. ఈ క్రమంలో 40 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి క్షణక్షణం నిఘా పెట్టారు. అలాగే లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం 535 బస్సులు, అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సర్వం సిద్ధమైంది. నవరాత్రుల పాటు విశిష్ట పూజలందుకున్న గణనాథులను గంగ ఒడికి చేర్చేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ మేరకు జంట నగరాల్లోని అన్ని మార్గాల్లో దాదాపు 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుందని, గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభాయాత్రను వీక్షించనున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ భారీ గణనాథుడు ఉదయం 7 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలోపే నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వినాయక ప్రతిమల నిమజ్జనానికి 256 క్రేన్లను సిద్ధం చేశారు. 3వేల మంది శానిటేషన్ సిబ్బందితో పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా జీహెచ్ఎంసీ చేపట్టనుంది. కమిషనర్ నుంచి శానిటేషన్ వర్కర్ దాకా మహా నిమజ్జనంలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగనుంది. శోభాయాత్రను సజావుగా సాగేలా ఆయా శాఖలు కలిపి మొత్తం రూ.30కోట్లను ఖర్చు చేశాయి. శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లో 48,179 లైట్లను ఏర్పాటు చేశారు. 303 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు చేయించారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్‌తో పాటు 33 చెరువుల వద్ద 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్ఎఫ్ బృందాలు, పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 74 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తున్నారు. కొలనుల వద్ద 27 బోట్స్‌ను సిద్ధంగా ఉంచారు. భక్తులకు మొబైల్ టాయిలెట్లు, స్టాటిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కాగా గురువారం సాయంత్రం వరకు 90వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్న అంచనా ఉందని అధికారులు తెలిపారు.
వివిధ శాఖల ఏర్పాట్లు..
భక్తులకు ఉచిత నీటి సరఫరా..
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు శోభాయాత్ర సాఫీగా జరిగేందుకు జలమండలి ఏర్పాట్లు చేసింది. భక్తులకు తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేసింది. గురువారం (నేడు) జరగనున్న నిమజ్జనానికి అదనంగా మరో 122 తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న దారి వెంట , ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తం 33.50 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు.

శోభాయాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశాం
గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని , హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్, వాటర్ వర్స్ డైరెక్టర్ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి చార్మినార్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లారు. ఉస్మాన్ గంజ్, మోజంజాహీ మారెట్, అబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫె్లై ఓవర్ల మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని గుర్తు చేశారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేరొన్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52 వేల విద్యుత్ లైట్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లు, 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంపుల ఏర్పాటుతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేశామన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3 వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించామని, వీరంతా 24 గంటలు విధులు నిర్వహిస్తారని వివరించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా 33 అదనపు ట్రాన్స్ పార్మర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో కొలనులు , అలాగే 33 బేబీ పాండ్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేరొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్స్ ఎండీ దానకిశోర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

దశ మహా విద్యాగణపతికి వర్షం నుంచి రక్షణ
నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షంతో ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యాగణపతి విగ్రహం తడవకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. 63 అడుగుల ఎత్తైన భారీ మట్టి విగ్రహం కావడంతో ముందస్తుగా సిద్ధంగా ఉంచిన 63 అడుగుల పాలిథిన్ కవర్‌ను కప్పేశారు. మూడు సార్లు భారీ వర్షం కురిసినా విగ్రహం చెక్కు చెదరదని, ఆలోపు ముందస్తుగా కవర్ కప్పామని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.
40 వేల మందితో బందోబస్తు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నవరాత్రుల పాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు నేడు గంగ ఒడికి చేరుకోనున్నారు. ఈ నిమజ్జన మహోత్సవానికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం వరకు పూర్తి చేయడం, అలాగే బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటల వరకు ముందుకు సాగేవిధంగా ట్రై పోలీస్ కమిషనర్లు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు, మౌంటెడ్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర సమావేశాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రై కమిషనరేట్ల పరిధికి సంబంధించిన సీసీ కెమెరాలు అనుసంధానం చేశారు.
నేడు పార్కుల మూసివేత
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని గురువారం ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్ పరిసరాల్లో ఉన్న పార్కులను మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. పార్కులకు వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
జిల్లాల బస్సుల రాకపోకలు నగర శివార్ల నుంచే..
నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేత చేస్తూ, శోభాయాత్ర జరిగే రూట్ల వివరాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ప్రధాన యాత్ర జరిగే రూట్లో గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరని, అలాగే పీవీఎన్ఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి నుంచి ఖైరతాబాద్, ఎన్టీర్ మార్గ్, ఐమాక్స్ రూట్లలో.. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం వరకు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించమని సీపీ పేర్కొన్నారు. నగరంలోని అన్ని జంక్షన్లలో ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రధాన శోభాయాత్ర జరిగే రూట్లో భారీకేడ్లు ఉంటాయన్నారు.లారీలు, జిల్లా బస్సులను నగరంలోకి ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అనుమతించరని తెలిపారు. శివారు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాలని సూచనలు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో హెల్ప్లైన్లు నంబర్లు(040-27852482, 8712660600, 9010 203626)ను సంప్రదించాలని సీపీ సూచించారు. అలాగే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.