(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భారీ కుదుపులకు లోనవ్వడం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 1979 నుంచి 2020 మధ్య విమానాల కుదుపులకు సంబంధించిన ప్రమాదాలు 55 శాతం మేర పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 2050 నాటికి ఈ తరహా ప్రమాదాలు 200 శాతం మేర పెరుగొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
భూతాపం కారణంగా ఆకాశంలో సంభవిస్తున్న మార్పులే విమాన కుదుపులు పెరగడానికి కారణమని బ్రిటన్ వాతావరణ నిపుణుడు పాల్ డీ విలియమ్స్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులతో ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. దీంతో గాలిలో అలజడి తీవ్ర స్థాయిలో ఉంటుందని, అప్పుడు విమానం ప్రయాణిస్తే, భారీ కుదుపులు ఏర్పడతాయని గుర్తుచేశారు. భూ వాతావరణం వేడెక్కడం వల్ల ఆకాశంలో గాలి పలుచుగా మారుతుందని, ఇలాంటి సందర్భాల్లో మబ్బులు లేకున్నా విమానం కుదుపులకు గురయ్యే ఘటనలు జరిగినట్టు గుర్తు చేశారు.