ఖైరతాబాద్, నవంబర్ 25 : రాష్ట్రంలోని క్రైస్తవులందరూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని, క్రైస్తవ సంఘాలు స్పష్టం చేశాయి. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ క్యాథలిక్ లే మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సమాఖ్య అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాథలిక్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు, మాజీ బీజేపీ క్రిస్టియన్ ప్రముఖ్ ఆండ్రూ జేవియర్ మాట్లాడారు. రాష్ట్రంలో క్రైస్తవులు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారంటూ ఊహాగానాలు వస్తున్నాయని, అందులో నిజం లేదన్నారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ క్రైస్తవులకు చేసిందేమి లేదని, ఇక బీజేపీ తమను పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన పదేండ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని, అన్ని వర్గాల ప్రజలతో కలిసి శాంతియుతంగా జీవిస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్కే మా మద్దతు…
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. దేశ చరిత్రలో క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా కానుకలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, పండుగను సైతం రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాలో క్రైస్తవ భవనాలు కొన్నింటిని నిర్మించగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట నిర్మాణంతో పాటు అనేక ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్, ఐటీ రంగం అభివృద్ధి ఇలా అభివృద్ధిలోనూ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో క్రైస్తవులందరూ సుఖ, శాంతులతో జీవిస్తున్నారని, అలాంటి తరుణంలో బీఆర్ఎస్కే అండగా నిలబడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు క్రైస్తవులందరూ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తమిళ క్రైస్తవ సంఘం నాయకులు మోజెస్ దాస్, మల్కాజిగిరి క్రిస్టియన్ కమ్యూనిటీ అధ్యక్షుడు కొర్ని లియాస్, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ అధ్యక్షుడు మెల్విన్ బెనిడిక్,్ట పాల్ సంపత్ కుమార్, రేమండ్, సురేశ్, ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు.