సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. భద్రతాపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జనానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో హుస్సేన్‌సాగర్ వద్ద ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న నిమజ్జనాలు.. నిమజ్జనం చివరి రోజు కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ భద్రతాపరమైన చర్యలను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జనం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం రూట్లు, ఏర్పాట్లు తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీపీతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు ఉన్నారు.
హుస్సేన్‌సాగర్ పరిసరాల పరిశీలన..ఏర్పాట్లపై సిబ్బందికి సిటీ కొత్వాల్ దిశా నిర్దేశం
బాలాపూర్ గణనాథుడికి రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్, మహేశ్వరం జోన్ డీసీపీ, ఏసీపీ, బాలాపూర్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. కమిషనర్‌ను సన్మానించి లడ్డూను అందజేస్తున్న గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు