Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కోట్లు వెచ్చించి రూపొందించిన అధ్యయనాలు.. నివేదికలు బుట్టదాఖలయ్యాయి.. ప్రభుత్వం మారగానే ప్రాజెక్టుల ప్రాధాన్యతలు మారిపోయాయి.. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయడమే ఏకైక ఏజెండాతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ సర్కారు.. మహానగరానికి సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న నిర్ణయం రవాణా రంగ నిపుణులను విస్మయానికి గురిచేసింది.
రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.. వాస్తవాలను ప్రభుత్వ పెద్దలకు వివరించకుండా మెట్రో రెండో దశలో మార్గాలను ప్రతిపాదించింది. బీహెచ్ఈఎల్- లక్డీకాపూల్ వయా గచ్చిబౌలి.. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు వయా ఓఆర్ఆర్ మార్గాలు యోగ్యమైనవని నివేదికలు చెప్పినా.. వాటిని పక్కనపెట్టారు. అంతిమ నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకులే అయినా… తీసుకునే నిర్ణయాలు సరైనవో కాదో సమగ్రంగా, శాస్త్రీయంగా వివరించే బాధ్యత ప్రభుత్వ అధికారులది. ఆ పాత్రను వారు విస్మరించారు. జీ హుజూర్ అంటూ..సర్కారు ఏది చేయమంటే అది చేసేస్తున్నారు.
అత్యంత రద్దీ మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రావడం వల్ల భారీగా ఇంధన పొదుపు, అదే సమయంలో వాహనాల నుంచి వెలువడే వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. కానీ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రేవంత్ సర్కారు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నది. ట్రాఫిక్ సమస్యల విషయంలో హైదరాబాద్ మహానగరం మరో బెంగళూరు నగరంలా మారకూడదంటే… రాజకీయ ప్రయోజనాల కన్నా… హైదరాబాద్ నగర ప్రజా రవాణా అవసరాలే ప్రధాన ఏజెండాగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది అందుకు విరుద్ధం.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశలో కొత్తగా మెట్రో మార్గాలను ప్రతిపాదించి, వాటిని నిర్మించేందుకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తోంది. కానీ అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న మార్గాల్లో ఒకటైన బీహెచ్ఈఎల్-గచ్చిబౌలి-టోలిచౌకీ మీదుగా లక్డీకాపూల్ వరకు 26 కి.మీ, అదేవిధంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించాల్సిన మెట్రో మార్గాలను పూర్తిగా పక్కన పెట్టింది. తనకే అంతా తెలుసు అన్నట్లుగా రెండో దశ మెట్రో కింద 5 మార్గాలను ప్రతిపాదించి, అత్యంత కీలకమైన ఆ రెండు మార్గాలను మాత్రం పక్కనపెట్టారు.
అత్యవసరం ఆ రెండు మార్గాలు…
మొదటి దశలోని 69 కి.మీ మెట్రో ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉండగా, అందులో రెండు కారిడార్లు (ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం) యోగ్యమైనవిగా నిరూపితమయ్యాయి. మూడో కారిడార్ అయిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గంలో ప్రయాణికులే ఉండటం లేదు. ఇదీ ఆరేండ్లుగా మెట్రో రైళ్లను నడుపున్న ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ చెబుతున్న మాట. మొదటి దశలో అత్యంత యోగ్యమైన రెండు కారిడార్ల మాదిరిగా బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాలు ఉంటాయని ట్రాఫిక్ అధ్యయన నివేదికలు స్పష్టం చేశాయి.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా.. రోడ్లన్నీ వాహనాలతోనే నిండి ఉంటున్నాయి. అలాంటి మార్గంలో మెట్రో రైలు సదుపాయం వస్తే వాహనాలకు బ్రేక్‌లు పడతాయి. కార్లను మెట్రో స్టేషన్లలోని పార్కింగ్ స్థలాల్లో ఉంచి.. ఎంచక్కా మెట్రో రైలులో ప్రయాణం చేసేందుకు నగరవాసులు ఎంతో ఆసక్తి చూపుతున్న పరిస్థితులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశలో చేపడుతున్న 5 మెట్రో మార్గాలతో పాటు ఐటీ కారిడార్, హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాంతాల మీదుగా ఆ రెండు మార్గాలను చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మొదలు పెడితేనే మరో 4-5 ఏండ్లలో ఆ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకు మరింత ట్రాఫిక్ పెరిగినా.. మెట్రో అందుబాటులో వస్తే భవిష్యత్ ట్రాఫిక్ కష్టాలకు ఫుల్స్టాప్ పడినట్టేనని రవాణా రంగ నిఫుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా మెట్రో అధికారులు ప్రభుత్వాన్ని ఒప్పించి .. పక్కన పెట్టేసిన ఆ రెండు మెట్రో మార్గాలను సైతం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదంటున్నారు.
రోజూ 60-70 వేల కార్ల రాకపోకలు
గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు ఉన్న 24 కి.మీ మార్గంలో ప్రతి రోజూ 60-70 వేల కార్లు రాకపోకలు సాగిస్తుంటే… అందులో సగానికి పైగా కేవలం శంషాబాద్ విమానాశ్రయం నుంచే ఉంటున్నాయి. అంటే హైదరాబాద్ వెస్ట్, నార్త్ దిక్కుల నుంచే వేలాది కార్లు ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నాయి. అదే సమయంలో ఓఆర్ఆర్ మీదుగా తూర్పు, దక్షిణ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి వచ్చే కార్లు 1-2 వేలకు మించి లేవు.
ఈ గణాంకాలన్నీ ఓఆర్ఆర్ మీద ఉన్న టోల్ వసూలు చేస్తున్న కేంద్రాల నుంచి స్పష్టంగా తెలుస్తుంది. నగరంలోని ఏ దిక్కు నుంచి ఎక్కువ ట్రాఫిక్ ఎయిర్‌పోర్టులోకి వస్తున్నది.. అన్న విషయాన్ని ఓఆర్ఆర్ మీద రాకపోకలు సాగించే కార్లే చెబుతున్నాయి. ఇలా ఎంతో స్పష్టమైన ఆధారాలకు తోడు కోట్ల రూపాయలు వెచ్చించి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రూపొందించిన ట్రాఫిక్ అధ్యయనాలు, ఆయా సంస్థలు ఇచ్చిన నివేదికలను బుట్ట దాఖలు చేయడంపై పట్టణ రవాణా రంగ నిపుణులు మండిపడుతున్నారు.