బంజారాహిల్స్, జూన్ 28: పీకలదాకా మద్యం సేవించి పక్క ఫ్లాట్‌లోని యువతితో గొడవకు దిగడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై ఓ యువతి వీరంగం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న అలిస్ జోసెఫ్ (26) అనే యువతి గతంలో ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండేది. ఇటీవల వేరే ఉద్యోగం కోసం వెతుకుతోంది. కాగా తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో పీకలదాకా మద్యం సేవించి ఫ్లాట్‌కు వచ్చిన అలిస్ జోసెఫ్ తన పక్కింటి ఫ్లాట్ డోర్‌ను కొట్టింది. దానిలో నివాసం ఉంటున్న బెంగాల్‌కు చెందిన నేహా థాపా అనే యువతితో గొడవకు దిగింది. సుమారు అరగంటపాటు న్యూసెన్స్‌కు పాల్పడడంతో పాటు డయల్ 100కు ఫోన్ చేసిన అలిస్ జోసఫ్ తన పక్కింట్లో గంజాయి అమ్ముతున్నారంటూ చెప్పింది.
దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు సోదా చేయగా అలాంటి అనవాళ్లు లభ్యం కాలేదు. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న అలిస్ జోసఫ్ పోలీసులపై నోరుపారేసుకోవడంతోపాటు గదిలోకి వెళ్లి గొళ్లెం పెట్టుకుంది. ఇంట్లోని కిచెన్‌లో గ్యాస్ స్టవ్‌ను తెరిచి గ్యాస్ ఓపెన్ చేసింది. అంతటితో ఊరుకోకుండా నిప్పు వెలిగించడంతో మంటలు చెలరేగాయి. దీంతో బయటున్న పోలీసులతో పాటు ఇంటి యజమాని, స్థానికులు కలిసి తలుపులు బద్దలు కొట్టి మంటలు అర్పారు. నిందితురాలు అలిస్ జోసెఫ్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. నేహా థాపా ఫిర్యాదు మేరకు బాధితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.