సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు టెండర్ గడువు బుధవారంతో ముగియనుంది. ప్రభుత్వ రంగ సంస్థగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) అంతర్జాతీయ స్థాయిలో బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటికే నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి సుమారు 13 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాగా, ఆయా కంపెనీలు టెండర్లు దాఖలు చేయనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన టెండర్లను తెరిచి మొదట టెక్నికల్ బిడ్లను పరిశీలించనున్నామని, ఆ తరువాతే ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. రెండింటిలో అర్హత సాధించి, తాము నిర్ణయించిన ధర కంటే తక్కువ కోట్ చేసిన సంస్థకు నిర్మాణ పనుల బాధ్యతను అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు, నైపుణ్యం కలిగిన స్వతంత్ర ఇంజినీర్లు, మెట్రో అధికారుల సమక్షంలో టెండర్ల పరిశీలన చేస్తారని తెలిపారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. 13న ప్రకటన చేయనున్నారు. ఎంపికైన సంస్థ ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ నిర్మాణాలు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్ , మెకానికల్ పనులు, రోలింగ్ స్టాక్ (రైలు) సరఫరా, కమిషనింగ్తో సహా అన్ని సివిల్ నిర్మాణాల రూపకల్పన, నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అలాగే మెట్రో మార్గంలో విద్యుత్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) గేట్లు మొదలైనవి అన్ని కాంట్రాక్టు పొందిన సంస్థే ఏర్పాటు చేయాలి. ఈ మొత్తం పనులన్నీ చేసేందుకు రూ.5,688 కోట్ల అంచనాతో కాంట్రాక్ట్ విలువను నిర్ణయించామని అధికారులు వెల్లడించారు.