Hyderabad | వెంగళరావునగర్, మార్చి 27 : ఎయిరిండియా ఉద్యోగినికి నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై కన్నేసిన కామాంధుడు.. రెస్టారెంట్ నుంచి హోటల్ వరకు వెంబడించాడు. హోటల్లో తన గదిలోకి వెళ్లిన యువతి కోసం ఆ కామాంధుడు పదేపదే డోర్ బెల్ మోగించడంతో భయాందోళనకు గురైంది. హోటల్ రిసెప్షన్లో బాధితురాలు చెప్పడంతో.. హోటల్ సెక్యూరిటీ సిబ్బంది ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన ఎయిరిండియా ఉద్యోగిని (29) ఈనెల 23వ తేదీన అమీర్‌పేట్ గ్రీన్ పార్క్ హోటల్లో బస చేసింది. ఈనెల 25వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో హోటల్లోని తులిప్ రెస్టారెంట్లో డిన్నర్ చేసుకుని తన గదికి బయల్దేరింది. అదే హోటల్లోని రెస్టారెంట్లో డిన్నర్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. ఆమె వెనకాలే రూమ్ వరకూ వచ్చాడు. దీంతో భయంతో తన హోటల్ రూమ్‌లోకి వెళ్లి తలుపునకు గడియ బిగించింది. యువతి ఉన్న రూమ్ బయట డోర్ వద్దకు వచ్చిన ఆ కామాంధుడు బెల్ మోగించాడు. భయాందోళనకు గురైన యువతి తలుపు తెరవలేదు. కొద్ది నిమిషాల పాటు అక్కడే ఉన్న ఆ వ్యక్తి ఆ రూమ్ లోకి వెళదామనుకుని కాపుకాసి అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయాడు. డోర్ బయట అలికిడి లేకపోవడంతో కామాంధుడు వెళ్లినట్లు గుర్తించిన బాధిత యువతి హోటల్లోని రిసెప్షన్ కౌంటర్లో ఫిర్యాదు చేసింది. దాంతో హోటల్లోని సీసీ కెమెరాల్ని పరిశీలించగా.. ఎయిరిండియా ఉద్యోగినిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి ఉప్పల్‌కు చెందిన రాజశేఖర్ గౌరిగా హోటల్ సిబ్బంది గుర్తించారు. దాంతో గ్రీన్ పార్క్ హోటల్ సెక్యూరిటీ మేనేజర్ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎయిరిండియా ఉద్యోగినిని వేధించిన నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.