సిటీబ్యూరో, మే17, (నమస్తే తెలంగాణ): వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారి చూపుతోంది. ఈ మార్పుల దిశగా ముందడుగు వేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యా పద్ధతుల్లో ఏఐని సమర్థవంతంగా సమన్వయం చేస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ ఆధారిత వర్చువల్ ట్యూటర్లు విద్యార్థులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. సందేహాల నివృత్తి, పునరావృత పరీక్షలు, వ్యక్తిగత శైలికి అనుగుణంగా కంటెంట్ సిఫారసులు చేయడం వంటి సేవలు అందిస్తున్నాయి. ఈ విధానం వలన విద్యార్థులు తమ సొంత స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారు.
అధ్యాపకులకు ఏఐ శిక్షణ ఇచ్చి, పాఠ్య ప్రణాళికలు, పనితీరు విశ్లేషణ, కంటెంట్ డెలివరీ వంటి రంగాల్లో ఆధునికీకరణ జరుగుతోంది. అంతేకాక, గ్లోబల్ టెక్ లీడర్లతో కలిసి పరిశోధన వేదికలను ఏర్పాటు చేయాలని యూనివర్శిటీ సంకల్పించింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా.వీఎస్కే రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ భవిష్యత్ కల ఇప్పటికే సాకారమైంది. దాని ద్వారా లోతైన నేర్పు, విద్యా సమానత్వం, ఉద్యోగ నైపుణ్యాలతో కూడిన బోధనకు దారి తీయనుంది. భవిష్యత్తును ఆవిష్కరించడంలో ఎంఆర్యూ కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశ ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ ఏఐని ఒక పాఠ్యాంశంగా కాకుండా బోధనా విధానంగా కూడా స్వీకరించాలి అని వీఎస్కే రెడ్డి సూచించారు. ఏఐతో భవిష్యత్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.