సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ):విద్యుత్ రంగంలో ఏ సమస్య వచ్చినా అనుభవమే ముఖ్యం కాగా ఆ అనుభవానికి ప్రస్తుతం దక్షిణ డిస్కంలో పని లేకుండా పోతోంది. అంతా ఏఐని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకుని ఆ ఉన్నతాధికారి పనులు చేస్తున్నారంటూ ఎస్పీడీసీఎల్లో చర్చ జరుగుతున్నది. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏఐ సహకారంతో పనిచేస్తానని ప్రకటించినప్పటికీ మానవవనరుల సహకారం తీసుకోవలసిన చోట, అనుభవం అవసరమైన చోట ఆ వైపే చూడకుండా అన్నింటికీ పరిష్కారం చాట్‌జీపీటీనే అంటున్నారంటూ ఆఉన్నతాధికారి పనితీరుపై కార్పొరేట్ ఆఫీసులో గుసగుసలాడుకుంటున్నారు.
అంతా ఏఐలోనే చేస్తే మనుషులెందుకు
గతంలో తాము పనిచేసిన అనుభవాన్ని ముందర పెట్టి మాట్లాడుదామనుకున్నా ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని, ఒకవేళ ఎవరైనా ఇలా చేద్దామంటూ ఏదైనా సలహా ఇస్తే ఏఐ సహకారం తీసుకుని అది ఓకే అంటేనే ఆ సలహాలు స్వీకరిస్తున్నారంటూ వారు చెప్పుకుంటున్నారు. ఇటీవల వర్షం పడినప్పుడు కరెంట్ పోతే అందుకు కూడా ఏఐ సహకారం తీసుకుని చాట్‌జీపీటీ ద్వారా మొత్తం సమాచారాన్ని కనుక్కొని పనిచేశారని, క్షేత్రస్థాయిలో సిబ్బంది అనుభవాన్ని పట్టించుకోకుండా కేవలం చాట్‌జీపీటీ నుంచి వచ్చిన సమాచారాన్ని అధారంగా చేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. వాస్తవానికి తనకు ఈ సంస్థ అనుభవం కొత్తదే అయినా చాలెంజింగ్‌గా తీసుకోవలసిన ఎండాకాలంలో వచ్చిన తర్వాత ఎలా పనిచేయాలనేది కూడా ఏఐ సాయమే తీసుకోవడంపై ఆ అధికారిని అందరూ వింతగా చూస్తున్నారు.ఇప్పుడు బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఇక ఆ ముఖ్యవ్యక్తే డిస్కంలో కీలకపాత్ర పోషిస్తారని, ఆయన చెప్పినట్లే వింటున్న ఉన్నతాధికారి బదిలీల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనంటూ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
క్షేత్రస్థాయి పర్యటనలేవి?
అడుగడుగునా అంతరాయాలతో నగరవాసులు కరెంట్ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి మాత్రం ఆఫీసు వదలడం లేదనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటనలతో సిబ్బందిని అప్రమత్తం చేయాల్సిన చోట ఎలాంటి కదలిక లేకుండా కార్యాలయం నుంచే పరిపాలనచేస్తూ అవసరమైతే డైరెక్టర్లను క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చి తనకు రిపోర్ట్ ఇవ్వాలని చెబుతున్నట్లు తెలిసింది. దీనిపై ఓ డైరెక్టర్‌ను అడిగినప్పుడు సినిమాటిక్‌గా చేయడం ఈ ఉన్నతాధికారికి రాదని, ఒకవేళ మీకు కావాలంటే ఫొటోలు తీయించి పంపిస్తామంటూ సమాధానమిచ్చారు.
అయితే ఆ డైరెక్టర్ మాత్రం ముందుగా ఉన్నతాధికారి క్షేత్ర పర్యటనలలోనే ఉన్నారని చెప్పినప్పటికీ ఆయన మాత్రం మాస్టర్‌ప్లాన్ విభాగంలో కూర్చున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఉన్నతాధికారి వద్ద సుమారు 250ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చూడాలంటూ ఎవరైనా చెబితే అందులో ఒకట్రెండు ముఖ్యమైనవి తీసుకురమ్మని, మిగతావి తర్వాత చూద్దామంటున్నట్లు డిస్కంలో చెప్పుకుంటున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లకు స్వస్తి పలుకుదామనుకుంటే ప్రభుత్వం నుంచి, ఇంధనశాఖ నుంచి వీసీలు నిర్వహించాలని గట్టిగా చెప్పడంతో ఒక్క వీడియోకాన్ఫరెన్స్‌ను డైరెక్టర్లు, సీఈలతో నిర్వహించి వచ్చేసారి నుంచి 45నిముషాలలోపు పూర్తిచేయాలని చెప్పినట్లు తెలిసింది.