సిటీబ్యూరో: ఇక్రిశాట్ తయారు చేసిన మిల్లెట్ వంగడాలను రాజస్థాన్లో సాగు చేయనున్నారు. బయోఫోర్టిఫైడ్ మిల్లెట్లను ఆ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసేందుకు అక్కడి రైతు సంఘాలు ముందుకొచ్చాయి. సాధారణ మిల్లెట్ల కంటే బయోఫోర్టిఫైడ్ మిల్లెట్లలో పోషకాలతో పాటు, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగిందని ఇక్రిశాట్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ ధన్ శక్తి రకానికి చెందిన మిల్లెట్ల సాగుపై అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్లో ఈ మిల్లెట్లను సాగు చేసేందుకు అక్కడి రైతులు సిద్ధమయ్యారు.
రక్తహీనతకు చెక్..
సాధారణ ధాన్యం రకం కంటే బయోఫోర్టిఫైడ్ వంగడాల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. మహిళలు, చిన్నపిల్లల్లో రక్తహీనతను నిరోధించేందుకు వీటిని అధికంగా సాగు చేసి వినియోగంలోకి తీసుకురావాలని రాజస్థాన్ రైతులు భావిస్తున్నారు.
సాగుకు ప్రత్యేక కార్యాచరణ
ప్రత్యేక విధానంలో సాగు చేసినప్పుడే అధిక దిగుబడికి అవకాశం ఉండటంతో… రాజస్థాన్ రైతులకు ముందుగానే సాగు విధానాలపై ఇక్రిశాట్ అవగాహన కల్పించింది. దీంతోపాటు సీడ్ బ్యాంక్ అభివృద్ధి, క్రాప్ అనాలసిస్, వాల్యూ చైన్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతోపాటు స్థానికంగా ఉన్న రజీవిక సంస్థ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వంటి సంస్థలను సమన్వయం చేసుకుంటూ రాజస్థాన్ వ్యవసాయ సాగును మరింత ప్రోత్సహించేలా కార్యాచరణను అమలు చేస్తోంది.