1908లో మూసీలో వచ్చిన వరదల్లో 150 మందిని కాపాడిన ఉస్మానియా దవాఖానలోని చింతచెట్టు ఉన్న ప్రాంతాన్ని అఫ్జల్పార్కుగా నామకరణం చేసి అభివృద్ధి చేశారు. కానీ ప్రస్తుతం నిర్వహణ కొరవడటంతో అందులో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లతో పార్కు కళావిహీనంగా మారింది. వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన పార్కును సుందరీకరించాలని పలువురు రోగుల సహాయకులు,స్థానికులు కోరుతున్నారు.
సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 13: 1908లో వచ్చిన మూసీనది వరదల్లో ఉస్మానియా దవాఖాన వెనుక భాగంలోని అఫ్జల్పార్కులో ఉన్న చింతచెట్టు పైకి ఎక్కి సుమారు 150 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన జరిగి ఇప్పటికీ 115 ఏండ్లు పూర్తైంది. 1908 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో భారీగా కురిసిన వర్షాలతో 28వ తేదీన మూసీనదిలో వరద తీవ్ర రూపం దాల్చడంతో వేలాది నివాసాలు నేలమట్టం కాగా 50 వేల మంది జలసమాధి అయ్యారు. రెండు లక్షల మందికి పైగా బాధితులుగా మారారు. వరద ల్లో 150 మందిని కాపాడిన ఉస్మానియా దవాఖానలోని చింత చెట్టు ఉన్న ప్రాంతాన్ని అఫ్జల్ పార్కుగా నామకరణం చేసి అభివృద్ధి చేశారు. నాటి నుం చి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది వరదల్లో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తున్నారు.
కొరవడిన నిర్వహణ..
కాగా అఫ్జల్ పార్కులో పెరిగిన మొక్కలు, చెట్లతోపాటు కొరవడిన నిర్వహణతో ప్రస్తుతం కళావిహీనంగా మారింది. ప్రతి ఏడాది హెరిటేజ్ సంస్థల ప్రతినిధులు సెప్టెంబర్ 28న వరదల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించడం తప్పించి పార్కు అభివృద్ధిని పట్టించుకోవడంలేదు. నాటి జీహెచ్ఎంసీ కమిషనర్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పార్కు సుందరీకరణ కోసం ఏడేండ్ల క్రితం నిధు లు కేటాయించినా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలే దు. వందేండ్లకుపైగా చరిత్ర కలిగిన అఫ్జల్ పార్కును సుందరీకరించి ఉస్మానియా దవాఖానకు వచ్చే రోగులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రోగి సహాయకులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.