Shankarpally | శంకర్పల్లి, జూన్ 26: రైలు పట్టాలపై కారు నడుపుతూ ఒక యువతి హల్చల్ చేసిన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంకర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్‌పై కారు నడుపుతూ వెళుతుండగా రైల్వే ఉద్యోగులు, స్థానికులు గమనించి శంకర్పల్లి రైల్వే స్టేషన్, నాగులపల్లి రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఆ మార్గంలో వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కారుతో ట్రాక్‌పై హల్చల్ సృష్టించడంతో.. రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. విషయం తెలుసుకున్న శంకర్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి చెందిన వోమికా సోనీగా గుర్తించారు. ఉద్యోగం పోయినందున మతిభ్రమించి అలా ప్రవర్తించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను చేవెళ్లలోనే ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది. ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చాక తెలుస్తాయని పోలీసులు చెప్పారు.