భూములు అమ్ముకొని..
మౌలిక వసతులతో మెరుగైన మార్కెట్ అవకాశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టిస్తే.. అందుకు భిన్నంగా ఉన్న భూములను అమ్ముకొని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క అడుగు ముందే ఉంది. గతంలో అభివృద్ధి చేసిన భూములను పొతం పట్టించి ఒక్క ఏడాదిలోనే రూ. 6వేల కోట్లకు పైగా నిధులు కేవలం భూముల వేలం నుంచే తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ దాహానికి అనుగుణంగా ఔటర్ దాటిన తర్వాత ఉన్న భూములపై కన్నేసింది. ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలకు ఆనుకుని, పట్టణీకరణకు చేరువలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని భూములే లక్ష్యంగా హెచ్ఎండీఏ సన్నద్ధం అవుతున్నది.
సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ల్యాండ్ పార్శిళ్లు పూర్తి కావడంతో… ఇక ఔటర్ దాటిన తర్వాత విస్తరించి ఉన్న పెరి(ప్యూర్) అర్బన్ భూములపైహెచ్ఎండీఏ దృష్టి పెట్టింది. ఇన్నాళ్లు అవుటర్‌కు చుట్టూ ఉన్న గ్రోత్ కారిడార్‌లోని భూములను రెవెన్యూ కోసమే విక్రయించింది. ఔటర్ నుంచి ట్రిపులార్ మధ్య ఉన్న ప్రాంతాన్నీ పెరి అర్బన్ రీజియన్ డెవలప్ చేసే క్రమంలో… ఈ ప్రాంతంలో భూముల సమీకరణ, ల్యాండ్ విధానాలతో ల్యాండ్ పార్శిళ్లను సిద్ధం చేసే యోచనలో ఉంది. కోర్ సిటీలో ఇప్పటివరకు నిర్మించిన లే అవుట్లలో ఖాళీ జాగాల అమ్మకాలు పూర్తి కావడంతో అటువైపు దృష్టి సారించింది.
పుష్కలంగా పెరి అర్బన్ భూములు
ఇటీవల హెచ్ఎండీఏ పరిధిని 10వేలకు పైగా చదరపు కిలోమీటర్లకు పెంచిన సర్కారు… ఔటర్ లోపల ఉన్న ప్రాంతాన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. అవుటర్ నుంచి ట్రిపులార్ వరకు విస్తరించి ఉన్న భూములలో పట్టణీకరణకు అనువుగా మౌలిక వసతులు, ప్లానింగ్, మాస్టర్ ప్లాన్ అమలు వంటి అంశాలను హెచ్ఎండీఏ పర్యవేక్షించనుంది. తక్కువ ధరలో భూములను సేకరించడం లేదా సమీకరించడం ద్వారా ల్యాండ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారు. ఇక క్రమంలో ఔటర్ నుంచి ట్రిపులార్ మధ్య ఉండే భూములు అనుకూలంగా ఉంటాయని భావించి, పెద్ద మొత్తంలో ల్యాండ్ డెవలప్ చేయడం ద్వారా హెచ్ఎండీఏకు భవిష్యత్తులో ఆదాయ వనరుగా మారుతుందని యోచిస్తున్నారు.
ఆదాయ వనరులుగా భూములు
బీఆర్ఎస్ హయాంలో భూముల వేలానికి విపరీతమైన డిమాండ్ రావడానికి ప్రధానంగా మౌలిక వసతులను మెరుగుపరచడం. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం భూములను కేవలం ఆదాయ వనరులుగానే భావిస్తోంది. వీటిని విక్రయించడం ద్వారా రాష్ట్ర ఖజానా నిండుతుందనే లెక్కలు వేసుకుంటోంది. కానీ విలువైన భూములను ఆదాయ వనరులుగా మార్చే యోచన చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో పెరి అర్బన్ ఏరియాలో ఉన్న భూములను కూడా అదే తీరుగా పరిగణిస్తోంది. దీని కోసం ఔటర్ నుంచి ట్రిపులార్ మధ్య విస్తరించి ఉన్న పెరి అర్బన్ ఏరియాలోని భూములను పొతం పట్టించే విధంగా మేధోమథనం జరుగుతోంది.