సిటీబ్యూరో: ఆబ్కారీ శాఖలో సుధీర్ఘ కాలం తరువాత కానిస్టేబుళ్లు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆయా స్థాయి పోస్టింగ్లు కల్పించలేదని ఆబ్కారీ వర్గాలు వాపోతున్నాయి. మొత్తం 137 మందికి పదోన్నతులు లభించాయి. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా 31 మందికి, ఎస్ఐ నుంచి సీఐలుగా 69 మందికి, సీఐ నుంచి ఏఈఎస్లుగా 14 మందికి, ఏఈఎస్ నుంచి ఈఎస్గా 14 మందికి, ఏసీ నుంచి డీసీలుగా 9 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. అయితే ఏ ఒక్కరికీ పోస్టింగ్లు కల్పించలేదు. కానిస్టేబుళ్లు మినహా ఇతరులకు పదోన్నతులు లభించి దాదాపు రెండు నెలలు గడిచింది. హోదా పెరిగినప్పటికీ కింది స్థాయిలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. ఫోకల్ ఏరియాలో పోస్టింగ్ కోసం అప్పుడే పైరవీలు మొదలైనట్లు వినికిడి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ కోసం చాలా మంది పోటీ పడుతున్నట్లు సమాచారం.